e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జిల్లాలు అటవీ సంరక్షణ కట్టుదిట్టంగా

అటవీ సంరక్షణ కట్టుదిట్టంగా

అనంతగిరి అడవి చుట్టూ కందకాలు, ఫెన్సింగ్‌ ఏర్పాటు
జిల్లాలో అడవి విస్తీర్ణం 1.8లక్షలు ఎకరాలు
అటవీ విస్తరణపై దృష్టి సారించిన అధికారులు
రూ.186 కోట్లతో ప్రణాళికలు
ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యం

వికారాబాద్‌, జూలై 29, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో అడవుల అభివృద్ధికి సంబంధిత అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం రూ.186 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. జిల్లావ్యాప్తంగా 93 ప్రాంతాల్లో 1.8లక్షల ఎకరాల అటవీ విస్తీర్ణం ఉన్నది. దీన్ని మరింత పెంచడంతోపాటు జీవవైవిధ్యాన్ని పెంపొందించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. అలాగే కబ్జాలు, ఆక్రమణలు, సరిహద్దుల వివాదాల నుంచి అడవిని కాపాడేందుకు కందకాల తవ్వకం, ఫెన్సింగ్‌ వంటి సంరక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతగిరి కొండ చుట్టూ 900 కిలోమీటర్ల మేర కందకాలు, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 500 కిలోమీటర్ల మేర కందకాల తవ్వకం పూర్తయింది. మరోవైపు వనసంపదను పెంచేందుకు 800 ఎకరాల్లో ప్లాంటేషన్‌ చేపట్టారు. ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నారు.

వికారాబాద్‌ జిల్లాలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. కాగా ఇప్పటికే ఉన్న అడవులను మరింతగా దట్టమైనవిగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో అటవీ శాఖ ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది. అడవుల పునరుజ్జీవ పథకం అమలుకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. అటవీ రక్షణ చర్యలకు అధికారులు పూనుకున్నారు.
జిల్లాలో 13% అడవి ఉండగా.. 9.5 సాంద్రత ఉన్నది. వీటిని మరింతగా పెంచడంతో పాటుగా జీవవైవిధ్యం, సుస్థిరతను కాపాడేందుకు కందకాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తున్నారు. అడవి విస్తీర్ణం 1.8లక్షల ఎకరాలు ఉండగా, 93 ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. 68 బ్లాక్‌లను గుర్తించారు. ఇందులో 16 బ్లాక్‌లు (భూ వివాదాలు, కబ్జాలు, సరిహద్దులు) సమస్యాత్మకంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అనంతగిరి కొండ చుట్టూ 900 కిలోమీటర్ల మేర కందకాలు, ఫెన్సింగ్‌ ఏర్పాట్లు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 500 కిలోమీటర్ల మేర కందకాలను పూర్తి కాగా.. ఇంకా 100 కిలోమీటర్ల మేర పూర్తి చేయనున్నారు. 300 కిలోమీటర్ల మేర (భూ వివాదాలు, కబ్జాలు, సరిహద్దులు) వివాదాలు ఉన్నాయి. 800 ఎకరాల్లో ప్లాంటేషన్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా 550 హెక్టార్లలో 180 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.

- Advertisement -

బ్లాకుల వారీగా మొక్కల పెంపకం..
జిల్లాలో అన్ని అడవుల అభివృద్ధికి రూ.186 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో అనంతగిరి అడవులే కాకుండా అనంతసాగర్‌ 3వేలు, దామగుండం 3వేలు, నాగులపల్లి 3వేల చొప్పున ఉండగా, ఇందూర్‌, జిన్‌గుర్తి, అడ్కిచర్ల, నస్కల్‌లో 10వేల ఎకరాల వరకు అడవులు ఉన్నాయి. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంపు, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు అడవుల పునరుజ్జీవ పథకం కింద ప్రభుత్వం ఈ సంవత్సరం రూ.12 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే రూ.4.50కోట్లతో ఫెన్సింగ్‌ నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలువడం కూడా పూరైంది. జిల్లాలో 1300 ఎకరాల్లో 180 రకాల ఔషధ మొక్కలున్నాయి. అత్యధికంగా అనంతగిరి అడవుల్లో 180 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. 68 బ్లాక్‌ల్లో విస్తృతంగా మొక్కల పెంపకం, సర్క్యూలేషన్‌ పాండ్స్‌, చెక్‌ డ్యాంల నిర్మాణాలు చేపట్టనున్నారు. సామాజిక అటవీ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 565 గ్రామాల్లో హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్‌, నర్సరీలు, గట్లపై మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అటవీ భూములే కాకుండా ఖాళీగా ఉన్న రెవెన్యూ భూములను సైతం దట్టమైన అడవులుగా తీర్చిదద్దనున్నారు.

అనంతగిరి, కోట్‌పల్లిలో జిందల్‌ కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు
జిల్లాలో నాలుగు చోట్ల అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తాండూరు మండలం అంతారం 100 ఎకరాలు, పరిగి మండలం జాఫర్‌పల్లి 55 ఎకరాలు, కోట్‌పల్లి 100 ఎకరాలు, అనంతగిరి 30 ఎకరాల్లో ఉన్న విస్తీర్ణంలో గుర్తించిన విధంగా ‘టెంట్‌ మాదిరి’ కాటేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. మొదటగా అనంతగిరి, కోట్‌పల్లి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిగా అడవి జీవనం మాదిరిగా ఉండనున్నది. అనంతగిరిలో 10, కోట్‌పల్లిలో 10 చొప్పున జిందల్‌ కాటేజీల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నారు. టెంట్‌లోనే గెస్ట్‌హౌస్‌లు (నోకాంక్రీట్‌) హాల్‌, బెడ్‌ రూం, బాత్‌రూం సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ‘ఏకో టూరిజం’ గెస్ట్‌ హౌస్‌ల మాదిరిగా నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహానగరం నుంచి వచ్చే పర్యాటకులతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫుడ్‌ మాత్రం సెల్ఫ్‌ కిచెన్‌ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గెస్ట్‌ హౌస్‌ నంబర్ల టెంట్‌లో వంటలు చేసే వారి ఫోన్‌ నంబర్లు, ఇతర తిండి పదార్థాల కేంద్రాల నంబర్లు ఉంటాయి. వారికి ఫోన్‌ చేసి ఆర్డర్‌ ఇస్తే సరిపోతుంది. వారు లంచ్‌ తీసుకువచ్చి ఇచ్చిపోయే విధంగా చర్యలకు ఉపక్రమించేందుకు అధికారులు వ్యూహరచన చేస్తున్నారు.

పకడ్బందీగా చర్యలు
ప్రభుత్వం పకడ్బందీగా చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అనంతగిరి అడవి చుట్టూ కందకాలతో పాటు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అటవీ భూముల సరిహద్దులను గుర్తించి బౌండరీ పిల్లర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం అడవి చుట్టూ 1189 చదరపు కిలోమీటర్లకు గాను ఇప్పటి వరకు 500 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఈ చర్యలతో అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడటమే కాకుండా వన్యప్రాణుల వేట, స్మిగ్లింగ్‌ వంటి అసాంఘిక శక్తుల కార్యకలాపాలను నిర్మూలించవచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. కందకాల్లో మట్టి కూరుకుపోకుండా ఇరువైపులా గచ్చకాయ మొక్కలను నాటి బండ్‌ స్టెబిలైజేషన్‌ చేయనున్నారు.

రూ.186 కోట్లతో ప్రణాళిక
జిల్లాలో అడవుల అభివృద్ధికి సంబంధించి రూ.186కోట్లతో ప్రణాళికలు రూపొందించాం. జిల్లాలో 68 బ్లాకులు ఉన్నాయి. వీటిలో 16 బ్లాకుల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అటవీ పునరుజ్జీవ పథకంలో భాగంగా మొదటగా రూ.12 కోట్లు కేటాయించాం. 1.8లక్షల ఎకరాల్లో అడవి విస్తీర్ణం ఉంది. జిల్లాలో నాలుగు అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేశాం. అంతారం, జఫర్‌పల్లి, కోట్‌పల్లి, అనంతగిరి ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. అనంతగిరి అడవుల్లో 180 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.
ఎం వేణుమాధవరావు, జిల్లా అటవీ శాఖ అధికారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana