Parth Pawar-Ajit Pawar | మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభా నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల్లో పవార్ వర్సెస్ పవార్ పోరాటం సాగుతోంది. ఎన్సీపీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్ కుటుంబ సభ్యులంతా ఆయన కూతురు సుప్రియా సూలేకు మద్దతుగా ప్రచారంలోకి దిగారు. మరోవైపు, ఆమె ప్రత్యర్థి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్‌కు మద్దతుగా పార్థా పవార్ ప్రచార బాధ్యతలు తలకెత్తుకున్నారు. ప్రస్తుతం బారామతి నియోజకవర్గంలో ‘జంతావటి’ యాత్ర పేరిట ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్థా పాటిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ క్యాటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. మరోవైపు ఫుణె నగర పోలీస్ కమిషనరేట్.. ప్రముఖులకు సెక్యూరిటీ తగ్గించడం గానీ, పూర్తిగా తొలగించడం గానీ చేస్తోంది. ఈ సమయంలో పార్థా పవార్‌కు భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పలువురిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
పార్థా పవార్ ఎవరో కాదు.. అజిత్ పవార్, సునేత్ర పవార్ ముద్దుల కొడుకే. తన తల్లి కోసం బారామతి లోక్ సభా స్థానాన్ని చుట్టేస్తున్నారు పార్థా పవార్. సామాజిక కార్యకర్తలతో సమావేశాలు, గ్రామసభల్లో చర్చాగోష్టి, పాదయాత్రలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. భారీగా ప్రజలు గుమిగూడినప్పుడు ఏమైనా జరుగవచ్చునన్న ఆందోళన నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం.. పార్థా పవార్‌కు వై ప్లస్ భద్రత కల్పించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. వై ప్లస్ క్యాటగిరీ కింద పార్థా పవార్‌కు 20 మంది సాయుధ కమెండోల రక్షణ లభిస్తుంది.
సార్వత్రిక ఎన్నికల వేళ పుణె పోలీస్ కమిషనరేట్.. కొందరు నేతలు, ప్రముఖుల భద్రత కుదించడమో, పూర్తిగా తొలగించడమో చేసింది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూతురు భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో సుప్రియా సూలే, యుగేంద్ర పవార్, రోహిత్ పవార్ భద్రత పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సునేత్ర పవార్ కోసం ఆమె భర్త అజిత్ పవార్, సుప్రియా సూలే కోసం ఆమె తండ్రి శరద్ పవార్ పోరాడుతున్నారు. మరాఠా నేతగా పేరొందిన శరద్ పవార్ ఎప్పటి వరకూ తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇప్పుడూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. మరోవైపు, అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్‌కు చెక్ పెట్టాలని యోచిస్తున్నారు.