రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు సీ-విజిల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శశాంక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు సీ-విజిల్ యాప్ నుంచి వచ్చిన 85 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. జిల్లాలో ఓటర్లను ప్రలోభ పెట్టినా, భయభ్రాంతులకు గురి చేసినా.. సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో సమస్యను పరిషరిస్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రజల చేతిలో సీ-విజిల్ అనే బ్రహ్మాస్త్రం పెట్టిందన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్లో సీ-విజిల్ యాప్‌ను ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరుగాలంటే ప్రజలు తమ కండ్ల ఎదుట కనిపిస్తున్న అన్యాయంపై వెంటనే సీ-విజిల్ యాప్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. సీ-విజిల్ యాప్ సురక్షితమైనదని, దీనిని ఆపరేటింగ్ చేయడం సైతం చాలా సులువని పేర్కొన్నారు. ఇంగ్లిష్‌లో కానీ తెలుగులో కానీ ఫిర్యాదు చేయవచ్చని, రంగారెడ్డి జిల్లావాసులు సీ-విజిల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.