చేవెళ్ల లోక్‌సభలో బీసీలకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పాలనలో బీసీలు ఎదుర్కొన్న కష్టాలను తల్చుకుని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని గెలిపించుకోకపోతే ఎదురయ్యే పరిస్థితులు ఊహించుకుంటేనే భయంగా ఉందని ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఈ ఎన్నికల్లో బీసీల సత్తా చూపి అహంకారపూరిత నేతలకు చరమగీతం పాడుదామని పిలుపునిస్తున్నారు. చేవెళ్లలో బీసీలకు అందివచ్చిన ఈ అవకాశాన్ని బీసీల్లోని అన్ని కులాలవారు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యత.. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బీసీలకు కల్పించిన ప్రాధాన్యతను నేతలు ఈ సందర్భంగా కొనియాడుతున్నారు. బీసీలను అణచివేయాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేసినా.. తిప్పికొట్టి బీసీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. అన్ని కులాలు ఐక్యంగా ఉండి కాసానిని ఎంపీగా పార్లమెంటులో కూర్చోబెడతామని కుండబద్దలుకొట్టి మరీ చెబుతున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ)
బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి మన బీసీ నాయకుడికే ఓట్లు వేసి గెలిపించుకుందాం. ఎంపీగా జ్ఞానేశ్వర్ గెలుపొందితేనే పార్లమెంట్లో మన సమస్యలపై పోరాటం చేసి మనకు న్యాయం చేస్తారు. కొండా, గడ్డం ఎంపీలుగా గెలిచి సొంత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ను వదిలి ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఈ ఎన్నికల్లో కాసాని గెలుపొందడం ఖాయం.
– మహేశ్, చేవెళ్ల మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసాని జ్ఞానేశ్వర్‌ను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించడం సంతోషకరమైన విషయం. బీసీలను చులకనగా చూస్తున్న నేతలను ఓడించి మన సత్తా చూపిద్దాం. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకు పట్టం కట్టాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకతీతంగా బీసీలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలి.
– ఇమ్రాన్, సింగప్పగూడ, చేవెళ్ల మండలం
జ్ఞానేశ్వర్ గెలుపుతో బీసీలకు రాజకీయ గుర్తింపు వస్తుంది. మరింత అభివృద్ధి చెందాలంటే కాసానికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలమంతా ఏకతాటిపైకి వచ్చి, కాసానిని గెలుపించుకొని చేవెళ్లను బీసీల అడ్డాగా మారుస్తాం. కేసీఆర్ బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది.
– ప్రవీణ్, మాసన్పల్లి, బషీరాబాద్
బీసీలంతా ఒక్కతాటిపైకి వచ్చి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలుపించుకునేందుకు ఇది మంచి అవకాశం. కాసాని అంటేనే బీసీ కులాలు గుర్తుకు వస్తాయి. బీసీ కులాలను ఏకం చేసిన కాసానిని పార్టీలకతీతంగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలి. బీసీల సత్తా దేశవ్యాప్తం కావాలంటే కాసాని గెలుపు ఒక్కటే మార్గం.
– అంజిలప్ప, ఇందర్చేడ్, బషీరాబాద్ మండలం
బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపునకు బీసీలంతా ఏకమవ్వాలి. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల నమ్మకాలతో ఆడుకునే వ్యాపారవేత్తలకు తగిన బుద్ధి చెబుతూ బీసీల బలాన్ని ఢిల్లీ వరకు తెలిసేలా చేద్దాం. బీసీలతో పాటు మిగతా వర్గాల ప్రజలు సైతం కాసాని గెలుపునకు మద్దతుగా నిలువడం ఖాయం. చేవెళ్ల గడ్డపై ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం పక్కా.
– మల్లేశ్, చందానగర్
బీసీల సంక్షేమం కోసం ఏండ్లుగా పోరాడుతున్న నేత కాసాని జ్ఞానేశ్వర్. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతున్నారు. వ్యాపారాలు, స్వార్థ రాజకీయాలతో పదవి కోసం పాకులాడే నాన్ లోకల్ లీడర్లకు ఎన్నికల్లో పరాభవం తప్పదు. బీసీలందరూ అప్రమత్తంగా ఉండి కాసాని గెలుపునకు కృషిచేద్దాం.
– శంకరి రాజు ముదిరాజ్, శేరిలింగంపల్లి
మన ఓట్లు మనమే వేసుకొని బీసీల సత్తా చాటుదాం. బీసీలను తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి ఓటుతో బుద్ధి చెబుతాం. బీసీలను గుర్తించి చేవెళ్ల పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌కు టికెట్ ఇవ్వడం శుభపరిణామం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీలకు సముచిత స్థానం కల్పించారు.
– యాతం బాల్‌రాజ్ యాదవ్, సంఘం నాయకుడు, బడంగ్‌పేట
చేవెళ్ల పార్లమెంటు గడ్డపై గులాబీ జెండాను ఎగురవేద్దాం.. బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్‌ను ఎంపీ అభ్యర్థిగా గెలిపించి పార్లమెంట్‌కు పంపుదాం. బీసీ వాణి, బాణిని వినిపించే ఏకైక గొంతుక కాసాని. గతంలో బీసీల కోసం అనేక ఉద్యమాలు చేశారు. బీసీల కోసం సంవత్సరాల తరబడి పోరాటం చేసిన కాసానికి ఒక్కసారి అవకాశం ఇద్దాం.
– కిరణ్, బీసీ సంఘం నాయకుడు, బడంగ్‌పేట
బీసీల సంక్షేమం కోసం కృషిచేసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్. ఆయన చేసిన పోరాటాల ఫలితంగా ఎంతో మంది బీసీలు ఆర్థికంగా ఎదిగారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లా చైర్మన్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు జ్ఞానేశ్వర్. అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. బీసీలందరూ ఐకమత్యంగా కలిసి ఎలాగైనా కాసానిని గెలిపించుకుంటాం.
– పరమేశ్, అత్తాపూర్
బడుగు బలహీన వర్గాల అభ్యన్నతికి పాటుపడిన బీసీ నేత కాసానిని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించడం హర్షణీయం. ఇంటింటికీ తిరిగి బీసీల మద్దతు కూడగడతాం. బీసీలందరూ కారు గుర్తుకు ఓటువేసేలా ప్రచారం చేస్తాం. బీసీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకోవాలి.
– రాముయాదవ్, హైదర్‌గూడ
బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చి గౌరవించింది. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చి గౌరవించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జనాభాలో సగభాగం ఉన్న బీసీలందరూ కాసానీ జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకోవడం ఒక్కటే మిగిలి ఉన్నది. బీసీలతో పాటు ఇతర కులాలు కూడా జ్ఞానేశ్వర్ గెలుపునకు కృషి చేయాలి.
– ప్రశాంత్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, పూలపల్లి
చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్‌కు పట్టం కడుతాం. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కేసీఆర్ టికెట్ కేటాయించారు. ఆయనను గెలిపిస్తే సామాజికంగా న్యాయం జరుగుతుంది. కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిస్తాం. బీసీలకు న్యాయం జరిగేందుకు బీసీ నాయకుడిని గెలిపించుకోవాలి.
– మాలె కృష్ణయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ, కులకచర్ల
కాసాని బడుగు బలహీనవర్గాల ప్రజలకు అండగా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టిన జ్ఞానేశ్వర్‌కు ప్రతి ఒక్కరి మద్దతు ఉంటుంది. కాసాని గెలుపు కోసం మా వంతు కృషిచేస్తాం. కాసాని గెలిస్తేనే కేంద్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషిచేసేందుకు అవకాశముంటుంది. జ్ఞానేశ్వర్ మచ్చలేని నాయకుడు.
– గుండుమల్ల నర్సింహులు, తిర్మలాపూర్, కులకచర్ల మండలం
బీసీలను ఏకం చేసిన నాయకుడు కాసాని. రాష్ట్రంలో 96 కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యలపై పోరాటం చేసిన ఘనత జ్ఞానేశ్వర్‌కు దక్కుతుంది. అలాంటి నాయకుడిని గుర్తించిన కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా ఆవకాశం కల్పించడం గొప్ప పరిణామం. బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే కాసాని ఎంపీగా గెలవాల్సిందే.
– శ్రీనివాస్‌గౌడ్, నారాయణపూర్, వికారాబాద్