శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Jan 29, 2021 , 00:08:19

ఆధార్‌తో ఫోన్‌ నెంబర్‌ అనుసంధానం తప్పనిసరి

ఆధార్‌తో ఫోన్‌ నెంబర్‌ అనుసంధానం తప్పనిసరి

  • ఫిబ్రవరి 1 నుంచి ఓటీపీతో రేషన్‌ 
  • వికారాబాద్‌ జిల్లాలో 22 ఆధార్‌ అనుసంధాన కేంద్రాల ఏర్పాటు 
  • ఓటీపీతోనే రేషన్‌ సరుకులు
  • ఫిబ్రవరి 1 నుంచి శ్రీకారం 
  • కొవిడ్‌-19 నివారణకు సరికొత్త విధానం
  • ఆధార్‌కు సెల్‌ నంబర్‌తో అనుసంధానం తప్పనిసరి
  • జిల్లాలో 22 చోట్ల మీసేవ కేంద్రాలు ఏర్పాటు 
  • 588 రేషన్‌ షాపులు
  • 2,34,940 మంది లబ్ధిదారులకు ఆహార భద్రతా కార్డులు

వికారాబాద్‌, జనవరి 28, (నమస్తే తెలంగాణ): కొవిడ్‌-19 మరింత కట్టడి చేసేందుకు సర్కార్‌ చర్యలు మొదలుపెట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవల్లోనూ మార్పులు తీసుకొస్తున్నది. అందులో భాగంగానే రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌ విధానానికి కాలం చెల్లనున్నది. ఇకపై రేషన్‌ షాపుల్లో సరుకులు తీసుకోవాలంటే వినియోగదారులు తమ సెల్‌ఫోన్లకు వచ్చిన ఓటీపీ చూపిస్తే చాలు రేషన్‌ డీలర్‌ సరుకులు ఇవ్వనున్నారు. రేషన్‌కార్డుదారుల్లో ఎవరిదైనా సెల్‌ ఫోన్‌ నంబర్‌ను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. 

ఫోన్‌నంబర్‌ అనుసంధానం తప్పనిసరి

వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా రెండు డివిజన్లలో 18 మండలాల్లో 588 రేషన్‌ షాపులు ఉన్నాయి. 2,34,940 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డుల ద్వారా రేషన్‌ బియ్యాన్ని అందిస్తున్నారు. బయోమెట్రిక్‌ ద్వారా ఒకరి నుంచి మరొకరికి కొవిడ్‌-19 వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలుకనున్నది. ఇకపై ఆహార భద్రత కార్డుపై బియ్యం తీసుకోవడానికి వెళ్లిన వారి కార్డు వివరాలు పీవోఎస్‌ మిషన్‌లో నమోదు చేస్తే లబ్ధిదారుడి పేరు సెల్‌ఫోన్‌కు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది. ఆ నంబర్‌ను పీవోఎస్‌ మిషన్‌లో నమోదు చేస్తే సరుకులు తీసుకున్నట్లు నమోదు చేస్తుంది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలుకు శ్రీకారం చుట్టేందుకు జిల్లా సివిల్‌ సప్లయ్‌ శాఖ చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే లబ్ధిదారులు ఆధార్‌కార్డుకు సెల్‌ఫోన్‌ నంబర్‌ లింక్‌ అయ్యింది,  లేనిది రేషన్‌ డీలర్లు పరిశీలిస్తున్నారు. అనుసంధానం కాకుంటే మీసేవ కేంద్రాలకు వెళ్లి ఫోన్‌ నంబరు నమోదు చేసుకోవాల్సిందిగా జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. సెల్‌ ఫోన్‌ లేని వారి విషయంలో కొంత ఇబ్బందికరంగా మారనున్నది. జనవరి 31 లోపు ఆధార్‌కు సెల్‌ఫోన్‌ అనుసంధానం చేసుకోవాల్సి ఉన్నది. 

మీ సేవ కేంద్రాలివే..

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వికారాబాద్‌ జిల్లాలో 22 ఆధార్‌ అనుసంధాన కేంద్రాలను లబ్ధిదారుల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. జిల్లాలోని  బషీరాబాద్‌, బొంరాస్‌పేట్‌, ధారూరు, కుల్కచర్ల, మోమిన్‌పేట మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున, పరిగి మండల కేంద్రంలో మూడు, తాండూరులో ఐదు, వికారాబాద్‌లో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో రేషన్‌ బియ్యంతో పాటు గ్యాస్‌పై సబ్సిడీ ఇతర ప్రభుత్వ పథకాలను పొందేందుకు వీలు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అందరూ వెంటనే తమ మండలాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో సంప్రదించి ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.  

అనుసంధానం తప్పనిసరి 

ఫిబ్రవరి నుంచి జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా రేషన్‌ పొందేందుకు లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్‌తో ఫోన్‌ నంబర్‌ను అసుసంధానం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో 22 ఆధార్‌ అనుసంధాన కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో రేషన్‌తో పాటు గ్యాస్‌పై సబ్సిడీ ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు వీలుంటుందని తెలిపారు.

- మోతీలాల్‌, అదనపు కలెక్టర్‌, వికారాబాద్‌ 

VIDEOS

logo