ఖమ్మం, ఏప్రిల్ 25: యాదవులు మాటిస్తే వెనకిపోరని ఖమ్మం ఎంపీ, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి స్పష్టం చేశారు. బీసీ కులాలన్నీ ఏకమై మోసాల కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వదించి, బీఫామ్ అందించి మీ వద్దకు పంపారని అన్నారు. ఈ క్రమంలో బీసీలంతా సమైక్యంగా ఉండి, అందరూ కలిసిమెలిసి పనిచేసి తనను గెలిపించి మళ్లీ పార్లమెంట్‌కు పంపాలని కోరారు. ఖమ్మంలో గురువారం జరిగిన యాదవుల ఆత్మీయ స మావేశంలో ఆయన మాట్లాడారు. యాదవులతో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తుచేశారు.
తన కన్నబిడ్డల కంటే మిన్నగా దివంగత చిత్తారు శ్రీహరియాదవ్ ఆకాంక్ష మేరకు ఆయన కుమార్తెను లక్షల డోనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదివించానని జ్ఞప్తికి తెచ్చారు. గత ఎన్నికల్లో కూడా యాదవులు తనకు మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. అలాగే ఈ ఎన్నికల్లో కూడా తనకు మద్దతుగా నిలిచి మంచి మెజార్టీ అందించాలని కోరారు. ఎమ్మె ల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడు తూ.. బీసీ బిడ్డ కూరాకుల నాగభూషణాన్ని కుట్రతో పదవి నుంచి దించిన కాంగ్రెస్‌కు యాదవులు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి కడుపు మంటతో ఈ పని చేశారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాల పనిచేసే నామాకు యాదవుల తమ ఆశీస్సులు అందించాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. గడీ దొరలకు, రైతు బిడ్డ నామాకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీసీలంతా ఏకమై నామాకు మద్దతుగా నిలవాలని కోరారు. ఓటేసినందుకు బీసీలపై కాంగ్రెస్ కక్షగట్టిందని ఆరోపించారు. అనేక కుట్రలు చేసి బీసీ బిడ్డ కూరాకుల నాగభూషణాన్ని పదవి నుంచి తొలగించారని విమర్శించారు.
కేసీఆర్ 10 ఏళ్ల అద్భుత పాలనలో 86 బీసీ కులాలకు హైదరాబాద్ లో విలువైన స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. యాదవ సంఘం నాయకులు చిత్తారు సింహాద్రియాదవ్, చిలకల వెంకటనర్సయ్య, మేకల సుగుణారావు, కూరాకుల వలరాజు, మీగడ శ్రీనివాసరావు, తుమ్మ రాంబాబు, కోడి లింగయ్య, చిత్తారు ఇందుమతి, చింతలచెర్వు లక్ష్మి, పద్మ, విజయలక్ష్మి, అమరబోయిన లింగయ్య, మొర్రిమేకల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం, ఏప్రిల్ 25: గతంలో తన నిధుల నుంచి రూ.లక్షలు వెచ్చించి గ్రౌండ్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టానని ఖమ్మం ఎంపీ, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో గురువారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. అక్కడి వాకర్స్‌ను కలిసి వారితో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి మెజార్టీతో గెలిపిస్తే అన్ని విధాలా అండగా ఉంటానని, మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎన్నో సమస్యలపై పార్లమెంట్ సాక్షిగా పోరాడానని గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తన గెలుపుకోసం ప్రతి ఒకరూ సహకరించాలని కోరారు. మరసారి ఆదరించి పార్లమెంట్‌కు పంపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే జిల్లాలో రూ.8 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులను తీసుకొచ్చానని వివరించారు.
అనంతరం వాకర్స్ స్పందిస్తూ.. ఇంతకుమును కూడా మీ కృషి వల్లనే ఈ గ్రౌండ్లో వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్, మంచినీటి పైపులైన్, పంపు ఏర్పాటయ్యాయని, షటిల్‌కోర్టులో వసతులు సమకూరాయని గుర్తుచేశారు. ఈ సందర్భంగా గ్రౌండ్‌ను అభివృద్ధి చేసిన నామాకు వాకర్స్ క్లబ్ తరఫున క్లబ్ అధ్యక్షుడు, కార్పొరేటర్ బుడిగం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో నామా మంజూరు చేసిన నిధులతోనే అనేక పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో వాకర్లందరమూ కారు గుర్తుకు ఓటు వేసి నామా అధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. వాకర్స్ క్లబ్ ప్రముఖులు వెంకట్, పార్థసారథి, మన్యం వెంకటరమణ, భాసర్‌రావు, ఉయ్యూరు కోటయ్య, జకుల లక్ష్మయ్య పాల్గొన్నారు.