మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jul 14, 2020 , 01:14:02

రైతే రాజవ్వాలి

రైతే రాజవ్వాలి

  •  రూ. 520 కోట్లతో రాష్టవ్యాప్తంగా   రైతు వేదికలు
  • ఒక్కో వేదిక నిర్మాణానికి రూ. 22 లక్షలు  
  • మొక్కలతోనే జీవకోటి మనుగడ  
  • ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలి
  • విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి  
  • వికారాబాద్‌ నియోజకవర్గ పరిధిలో 
  • పలుచోట్ల   రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన
  • చేవెళ్ల మండలం దుద్దాగులో   మొక్కలు నాటినమంత్రి
  • కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు    మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య

రైతులంతా ఒకే చోట పంటల సాగు, మార్కెటింగ్‌ విధానాల గురించి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై చర్చించుకునేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడుతాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని సిద్దులూరు, నాగసముందర్‌, బంట్వారం, బార్వాద్‌, మర్పల్లి, టేకులపల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా రైతు బంధు కోసం ప్రభుత్వం రూ. 14 వేల కోట్లు కేటాయిస్తున్నదన్నారు. పండించిన పంటలను భద్రంగా నిల్వచేసుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల్లో గోదాంలను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే, చేవెళ్ల మండలం దుద్దాగు గ్రామంలో నిర్వహించిన హరితహారంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అదుపు చేయాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి  సంరక్షించాలని సూచించారు.                                                                                                                                           - వికారాబాద్‌/చేవెళ్ల రూరల్‌


వికారాబాద్‌: రైతును రాజును చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం నియోజక వర్గంలోని సిద్దులూరు, నాగసముందర్‌, బంట్వారం, బార్వాద్‌, మర్పల్లి, టేకులపల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రూ.520 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మిస్తుందన్నారు. రైతులంతా ఒక్క దగ్గర చేరి పంటల సాగు, మార్కెటింగ్‌ విధానాల గురించి తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై చర్చించి పంట దిగుబడి పెంచేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రతి ఏటా రూ.14 వేల కోట్లు రైతుబంధుకు ప్రభుత్వం కేటాయిస్తున్నదన్నారు. ప్రతి సొసైటీకి ఒక గోదాం నిర్మించేలా కృషి చేస్తామన్నారు. ప్రతి నియోజక వర్గంలో 20 ఎకరాల్లో రైతులు తమ పంటలను నిల్వచేసుకుని, ధర వచ్చినప్పుడు అమ్ముకునేలా పెద్ద ఎత్తున గోదాంలు నిర్మించనున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి నెలా రూ.339 కోట్లు కేటాయించి, పల్లెలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు ఒక్కో రైతు వేదిక భవనానికి రూ.22 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం టేకులపల్లిలో పంచా యతీ భవనం ప్రారంభించారు. కార్యక్రమంలో వికారాబాద్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాద య్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణమూర్తి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌,  ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఆయా మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీలు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు చిగుళ్లపల్లి రమేశ్‌, విజయ్‌కుమార్‌, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

చేవెళ్లలో..

చేవెళ్ల రూరల్‌: మొక్కలతోనే జీవకోటి మనుగడ సాధ్యమని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మండలంలోని తల్లారం పంచాయతీ అనుబంధ గ్రామం దుద్దాగులో సర్పంచ్‌ సురేందర్‌ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మొక్కలు నాటి నీళ్లు పోశారు. అంతకుముందు గ్రామంలోని ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని రక్షించాలన్నారు. ప్రతి మొక్కను బాధ్యతతో రక్షించాలని ఎమ్మెల్యే యాదయ్య సూచించారు. గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్‌ సురేందర్‌ను అభినందించారు. పంచాయతీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. 

బాధిత కుటుంబానికి చెక్కు అందజేత

దుద్దాగు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త గూడెం జంగయ్య గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి టీఆర్‌ఎస్‌ సభ్యత్వం ఉండడంతో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ బీమా కింద అందించే సాయం రూ.2 లక్షల చెక్కును జంగయ్య భార్య దుర్గమ్మకు మంత్రి, ఎమ్మెల్యేలు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ మర్పల్లి మాలతి, వైస్‌ ఎంపీ కర్నె శివప్రసాద్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, చేవెళ్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.బాలకృష్ణ, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కోనపురం శిశుపాల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు పెద్దోళ్ల ప్రభాకర్‌, పడాల ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రమణారెడ్డి, దేవర కృష్ణారెడ్డి, మర్పల్లి కృష్ణారెడ్డి, జనార్దన్‌, మద్దెల చింటు, వనం మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేందర్‌ పాల్గొన్నారు.


logo