సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 09, 2020 , 00:08:28

గిరిజనులకు సాగుయోగం

గిరిజనులకు సాగుయోగం

  • ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సరికొత్త పథకం
  • ‘సీఎం గిరి వికాసం’తో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు
  • బీడు భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు
  • గిరిజనుల భూముల్లో బోరు తవ్వించి 
  • మోటరుతోపాటు విద్యుత్‌ లైన్‌ వేసేందుకు చర్యలు
  • త్వరలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు

గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వారి బీడు భూములను సాగుకు అనుకూలంగా మారుస్తారు. సీఎం గిరి వికాసం పేరిట  ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా. బోర్లు వేసి, పైపులు అమర్చి, విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తారు. ఈ పథకంలో అర్హత కోసం  కనీసం ఇద్దరు, అంతకంటే ఎక్కువ  రైతులకు కనీసం ఐదెకరాల పొలం ఉంటే తమ ప్రతిపాదనలను స్థానిక అధికారులకు అందజేయాలి. మండలస్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి వారి నివేదిక ప్రకారం జిల్లా స్థాయి అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.జియాలజిస్ట్‌లతో సర్వే చేయించి వారి సూచనల మేరకు  బోర్లు వేస్తారు.  గిరిజనులు వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం అన్ని  సదుపాయాలు ఉచితంగా కల్పిస్తుండడంతో వలసవెళ్లిన వారు వెనక్కి  వస్తున్నారని అధికారులు తెలిపారు.  

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : గిరిజన తెగలకు చెందిన ఎస్టీ, చెంచులను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎన్నో రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. గిరిజనుల భూములను సాగులోకి తీసుకువచ్చేందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త పథకానికి నాంది పలికారు. గిరిజనుల బీడు భూముల్లో బోర్లు తవ్వించి బోరు మోటరుతోపాటు విద్యుత్‌ లైన్‌ వేసి వాటిని సాగుకు యోగ్యంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం గిరి వికాస్‌ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. బోరు తవ్వించడంతోపాటు బోరు మోటరు, పైపులు, విద్యుత్‌ లైన్‌ సౌకర్యాలన్ని గిరిజన రైతులకు ఉచితంగానే కల్పించనున్నారు.

అయితే ఐదెకరాలకుపైగా భూములున్న గిరిజనులను మాత్రమే సీఎం గిరి వికాస్‌ పథకానికి అర్హులుగా ఎంపిక చేశారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు సంబంధిత మండలాల్లో ఐదెకరాలకు పైబడి భూమిగల అర్హులైన గిరిజనులకు సంబంధించి 102 మంది రైతులను ఎంపిక చేశారు. అర్హులైన గిరిజనులకు సంబంధించి ప్రతిపాదనలను పంపిన వెంటనే రైతుల భూముల్లో బోర్లు తవ్వించి మిగతా వసతులను కల్పించనున్నారు. అదేవిధంగా ఎంపిక చేసిన బ్లాక్‌లోని గిరిజనుల భూములన్నింటికి నీరందించి సాగులోకి తీసుకువస్తారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా షెడ్యూల్డ్‌ తెగలకు చెందినవారు 1,20,652 మంది ఉన్నారు.

గిరిజనుల భూములు సాగులోకి...

రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం బీడు, సాగు భూములకు ఉమ్మడి నీటి వినియోగ వసతులను కల్పిస్తూ వారి జీవన స్థితిగతులను పెంపొందించుటకుగాను సీఎం గిరి వికాసం పథకాన్ని ప్రారంభించింది. గిరిజన తెగలకు చెందిన ఎస్టీ, చెంచులకు సంబంధించిన చిన్న, సన్నకారు రైతుల భూములను సాగులోకి తీసుకువచ్చేందుకుగాను ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. పథకంలో భాగంగా కనీసం ఇద్దరుగాని అంతకంటే ఎక్కువ మంది రైతులకు సంబంధించిన కనీసం 5 ఎకరాలకుపైబడి పొలం కలిగి ఉన్న గిరిజన రైతులు తమ ప్రతిపాదనలను స్థానిక సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. అయితే మండల స్థాయిలో సంబంధిత పథకం పర్యవేక్షణతోపాటు లబ్ధిదారుల ఎంపికకుగాను తహసీల్దార్‌, విద్యుత్తు ఏఈ, ఎంపీడీవోలతో కమిటీని ఏర్పాటు చేశారు. సంబంధిత కమిటీలోని తహసీల్దార్‌ సీఎం గిరి వికాస్‌ పథకానికై ప్రతిపాదించిన భూమిపై ఎలాంటి వివాదాలు లేవని ధ్రువీకరించనున్నారు.

సంబంధిత బ్లాక్‌లో విద్యుత్తు సరఫరా సదుపాయాలను, సంబంధిత ధ్రువపత్రాలు సరైనవేననే ప్రతిపాదనలను జిల్లాస్థాయి అధికారులకు ఆయా మండలాల ఎంపీడీవోలు పంపుతారు. అయితే సాగును దృష్టిలో పెట్టుకొని ఒక్కో బ్లాక్‌లో నిర్ణయించిన భూములకు సరిపడా సాగునీటిని అందించే విధంగా బోరు వేయనున్నారు. విద్యుత్తు సౌకర్యం, మోటర్‌ పంపు, పైపులు తదితరాలన్ని ఉచితంగానే గిరిజన రైతులకు అందజేస్తారు. అంతేకాకుండా ప్రతిపాదించిన బ్లాక్‌ సమీపంలో చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్‌డ్యాం తదితరాలను భూగర్భజల వనరులు పెంపొందేలా చర్యలు చేపట్టనున్నారు. జియాలజిస్ట్‌లతో తొలుత సర్వే చేయించి వారి నివేదికల ఆధారంగానే ఎక్క డ భూగర్భజలాలు ఉన్నాయో ఆ భూముల్లోనే బోర్లు వేస్తారు. అయితే బోర్లు తవ్వించి, విద్యుత్‌ సౌకర్యం ఇప్పించడమే కాకుండా మిగతా శాఖల ద్వారా అవసరమైన వసతులను కల్పిస్తారు. ఉద్యానవన శాఖ ద్వారా బిందు సేద్యాన్ని కూడా గిరిజనుల భూముల్లో ఏర్పాటు చేస్తారు.  

జిల్లాకు 79 యూనిట్లు మంజూరు...

సీఎం గిరి వికాస్‌ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కు 79 యూనిట్లను మంజూరు చేసింది. అదేవిధంగా గిరిజనుల భూములను సాగులోకి తీసుకువచ్చేందుకుగాను రూ.1.60 కోట్ల నిధులను కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. అయితే గిరిజన రైతుల భూములు ఒకేచోట కనీసం ఐదెకరాలు ఉండేలా బ్లాక్‌ల ఎంపిక చేస్తారు. సంబంధిత అధికారులు జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న గిరిజన రైతుల వివరాలు సేకరించడంతోపాటు ఇప్పటికే గిరిజన రైతుల నుంచి వస్తున్న ప్రతిపాదనలను స్వీకరిస్తున్నారు. ప్రతిపాదనల

మేరకు జిల్లాలో 102 మంది గిరిజన రైతులను అర్హులుగా గుర్తించి సీఎం గిరి వికాసం పథకానికి ఎంపిక చేశారు. ఇప్పటివరకు 33 బ్లాకులకు సంబంధించి ప్రతిపాదనలను పూర్తి చేయగా త్వరలో బోర్లు వేసి పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో బ్లాక్‌ అభివృద్ధికిగాను రూ.2 లక్షల చొప్పున ఖర్చు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా భూ అభివృద్ధి పనులు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ గుంతలు, పండ్ల తోటల పెంపకం, గట్లపై టేకు మొక్కల పెంప కం, పశువుల పాక, మేకలు, గొర్రెల పాక, కూరగాయల పంది రి, కంపోస్ట్‌ పిట్‌లు ఇవ్వనున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా జీవన ఉపాధుల పెంపుదలతోపాటు డ్రిప్‌, స్ప్రింక్లర్‌ పైపులను పంపిణీ చేయడంతోపాటు వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాల ను,

పరికరాలను సబ్సిడీ ద్వారా పంపిణీ చేస్తారు.  ఈ పథకంతో ఎస్టీలు, చెంచులను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడంతోపాటు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన చెంచులు, గిరిజనులు తిరిగి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల కర్ణాటకలోని బీజాపూర్‌కు వలస వెళ్లిన పెద్దేముల్‌ మండలానికి చెందిన చెంచు జాతికి చెందిన రైతుల భూములను గిరి వికాస్‌ కింద ప్రతిపాదించడంతో వారు సంతోషం వ్యక్తం చేయడంతోపాటు.. తమ భూములను సాగులోకి తీసుకువస్తే వ్యవసాయం చేసుకుంటామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెలాఖరులో పనులు షురూ : డీఆర్డీవో కృష్ణన్‌

అర్హులైన గిరిజన రైతులను ఇప్పటికే ఎంపిక చేశాం. జిల్లాకు నిర్దేశించిన టార్గెట్‌లో కొన్ని బ్లాక్‌లకు సంబంధించి ప్రతిపాదనలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులో ఎంపిక చేసిన రైతుల బ్లాకుల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతాం. ప్రధానంగా గిరిజనుల బీడు భూములను సాగులోకి తీసుకురావడంతోపాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకుగాను సీఎం గిరి వికాస్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 


logo