Vasthu Shastra | మా ఊరిలో 70 ఏండ్ల కింద కట్టిన ఇల్లు అమ్మకానికి పెట్టారు. దానిని కొనవచ్చా?
– వి. సంధ్య, తొర్రూరు
పాత ఇల్లు కొనవద్దు అని ఎక్కడా లేదు. కానీ, కొనేది ఇంటిని చూశా? స్థలాన్ని చూశా?.. అనేది తేల్చుకోవాలి. మంచి దిశ కలిగి, చక్కని రోడ్లు ఉన్నప్పుడు ఇల్లు ముఖ్యం కాదు. స్థలం చాలా బాగుందని కొనొచ్చు. ప్రధానంగా పాత ఇల్లు కొనేటప్పుడు చూడాల్సింది.. ఆ ఇల్లు పాడు పడటానికి, ఆ ఇంట్లో దీపం పెట్టే దిక్కులేకుండా పోవడానికి కారణం ఏదై ఉంటుంది అనేది పసిగట్టాలి. నైరుతిలో బావి, తూర్పువైపు మిద్దె, ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకు, దక్షిణం వీధిపోటు.. ఇత్యాదులు కారణంగా ఉండే అవకాశం ఉంది. దోషాలు మార్చలేనివి అయినప్పుడు ఆ ఇంటి జోలికి వెళ్లవద్దు. కేవలం నిర్మాణానికి మాత్రమే సంబంధించిన దోషాలు ఉంటే.. ఎలాగూ ఇల్లు తొలగిస్తారు కాబట్టి, ఆ ఇంటిని కొనవచ్చు. పాత ఇల్లు కాబట్టి మంచి కలప ఉంటే, దానిని శుద్ధి చేసుకొని తిరిగి వాడుకోవచ్చు కూడా. నేల బాగున్నప్పుడు.. ఇంటిని పునాదులతో సహా తొలగించి ఇల్లు కట్టాల్సి ఉంటుంది.
కుండలిని యోగం అంటే ఏమిటి? వాస్తుకూ దానికీ సంబంధం ఉన్నదా?
– రామశర్మ, కొడంగల్
కుండలిని అంటే ఒక సర్పశక్తి. కుండలి అంటే.. పాము అనే అర్థంతోపాటు, చుట్టుకొని ఉన్నది అనే అర్థం కూడా ఉంది. సాధారణంగా పాము విశ్రాంతి సమయంలో చుట్టుకొని ఉంటుంది. పొడవుగా కర్రలా విశ్రమించదు. అలా చుట్టుకొనే ఉంటుంది కానీ, శబ్ద తరంగాలకు చటుక్కున చైతన్యం అవుతుంది. శక్తిని ప్రదర్శిస్తుంది. ఆ విధంగానే మానవ శరీరంలో శక్తి చక్రాలు ఉంటాయి. ఇవి సదా జాగృతం కావడానికి వేచిచూసే అమ్మవారి శక్తి కేంద్రాలుగా మన పూర్వులు గుర్తించారు. దానిని ఆధ్యాత్మిక పరంగా కుండలిని అని పిలుస్తారు. నాడుల సమూహంగా ఉండే ఈ స్థానాలను చక్రాలుగా వ్యవహరిస్తారు. అవి మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార చక్రాలు. ఈ ఏడు చక్రాలు ఎప్పుడైతే చైతన్యవంతం అవుతాయో.. అప్పుడు మనిషి పూర్ణ జ్ఞానవంతుడు అవుతాడు. దుఃఖ రహితుడు కాగలడు. దీని విశ్లేషణ చాలా లోతైనది. అయితే శాస్త్ర గృహానికి, వీటికి సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు. సృష్టిలోని శక్తులు మూడు రకాలు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. గృహ యజమాని మనోశక్తిని శాస్త్ర గృహం జాగృతం చేస్తుంది. తద్వారా.. శరీరంలోని చక్రాలు చైతన్యవంతం అవుతాయి. జ్ఞానం కలుగుతుంది. ఇందులో వాస్తవం ఏమిటంటే.. విశ్వశక్తి.. ప్రకృతి శక్తి. మనిషిలోని పంచేద్రియాల శక్తి అంతా ఒకే శక్తి. వీటిని అనుసంధానం చేసే స్థానం కావాలి. అదే శాస్త్ర నిబద్ధత కలిగిన ఇల్లు. ఇదంతా ఒక్క క్షణంలో.. ఒక్క రోజులో కాదు. వ్యక్తి మేధస్సు వికసనం చెందాలి. అది ఆయా పరిసర ప్రాంతాల ప్రభావాలను బట్టి ఉంటుంది. వ్యక్తి యోచనా సామర్థ్యం, వ్యక్తిత్వం ధర్మ నిష్ఠ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి మాత్రం మనం తప్పక అర్థం చేసుకోవాలి. గృహశక్తి.. లోక వికాసానికి, విజయ
సంకల్పానికి పనికి వస్తుంది. వికృత విలాసాలకు కానేకాదు.
మేము ఇల్లు పంచుకున్నప్పుడు మా బెడ్రూములో సగం మా అన్న ఇంట్లోకి పోయింది. అలా ఉండొచ్చా?
– బి. చంద్రయ్య, కంచెన్పల్లి
పాత ఇండ్లు అన్నదమ్ములు పంచుకునేటప్పుడు ఎలా పంచినా అది ఎవరికీ మంచి చేయదు. ఒకనాడు ఆ ఇల్లు అప్పుడున్న అవసరాల మేరకు కట్టి, కొన్నాళ్లు సమష్టిగా వాడుకొని, దానిని రెండు భాగాలుగా కోయడం మంచిదికాదు. అప్పుడు తూర్పు-ఉత్తరాలు ఇద్దరికీ ఉండకుండా పోవచ్చు. పాత ఇల్లు ఉంటే ఎవరో ఒకరే తీసుకోవాలి. లేదా ఇల్లు తొలగించి స్థలం పంచుకోవాలి. మీ పంపకం వల్ల మీకు నైరుతి భాగం లేకుండా పోయింది. అది పెద్ద దోషం. ఇదేకాదు.. మీ ఇల్లు చూస్తే ఎన్నో దోషాలు బయటపడతాయి. కాబట్టి మీరు ఇద్దరూ మాట్లాడుకొని ఎవరో ఒకరు సొంతం చేసుకోండి. లేదా ఇల్లు తీసేసి, ఇంటి మీద ఇల్లు కట్టుకొని ఉండండి. ఇలా మనిషిని సగం కోసినట్టుగా ఇల్లు పంపకాలు చేస్తే.. ఎవరూ ఆ ఇంట్లో యోగించరు. మీరు సరే.. మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి.
మాకు దక్షిణం రోడ్డు, తూర్పు రోడ్డు ఉంది. స్థలాన్ని ఇద్దరం పంచుకోవాలి. ఎవరు ఎటు దిక్కు, ఎలా తీసుకోవాలి?
– డి. చంద్రావతి, కుకునూర్‌పల్లి
అన్నదమ్ములా? అక్కాచెల్లెండ్లా?.. అనేది మీరు తెలుపలేదు. మీది ఆగ్నేయం బ్లాకు. స్థలం ఆకారం తూర్పు-పడమర పొడవు కొలత ఎక్కువగా ఉంటే, అందులో పడమర భాగం పెద్దవాళ్లు తీసుకోవాలి. చిన్నవాళ్లు తూర్పు భాగం తీసుకోవాలి. అప్పుడు పడమర భాగానికి దక్షిణం రోడ్డు ఒక్కటే వస్తుంది. చిన్నవాళ్లకు దక్షిణం, తూర్పు రెండు రోడ్లూ వస్తాయి. ఇక్కడ ఇద్దరూ దక్షిణ ముఖంగా ఇల్లు కట్టాలి. స్థలం ఉత్తర-దక్షిణం పొడవుగా ఉన్నప్పుడు దక్షిణ భాగం పెద్దవారు, ఉత్తర భాగం చిన్నవారు పంచుకోవాలి. అప్పుడు పెద్దవాళ్లకు దక్షిణం, తూర్పు రోడ్లు వస్తాయి. చిన్నవాళ్లకు తూర్పు రోడ్డు మాత్రమే వస్తుంది. ఆ విధంగా పంచుకుంటే పెద్దవాళ్లు దక్షిణ సింహద్వారంతో ఇల్లు కట్టాలి. చిన్నవాళ్లు తూర్పు ప్రధాన ద్వారం పెట్టి ఇల్లు కట్టాలి. ఎవరి కాంపౌండు వారికే ఉండేలా ఇండ్లు నిర్మించుకోవాలి. ఇండ్ల నిర్మాణంలో మెట్లలో పొత్తు వద్దు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?