– వి.సుమతి, మోత్కూర్
తరగతి మాత్రమే కాదు.. పాఠశాల ప్రాంగణం కూడా శాస్త్రపరంగా సిద్ధపరచాలి. ప్రధానంగా చెట్లు, విశాలమైన స్థలం లేకుండా పాఠశాలలు నిర్మించవద్దు. విత్తనాలు చల్లడానికి నారుమడి ఎలా సిద్ధం చేస్తామో.. మొక్కలు నాటడానికి మడులు ఎలా నిండుగా పెడతామో.. అంతేతీరుగా జీవితాలను పండించుకునే బతుకు బడులు అవి. పిల్లల మెదళ్లు వికసించేలా పాఠశాల ప్రాంగణం రూపుదిద్దుకోవాలి. తరగతి గదుల నుంచి ఏవైపు చూసినా పచ్చని చెట్లు కనిపించేలా పరిసరాలు ఏర్పాటు చేయాలి. లేకుంటే, పిల్లల అంతరంగ వ్యవస్థ శిక్షణకు సంసిద్ధం కాదు. మీరు ఎంచుకున్న స్థలానికి పెద్ద కాంపౌండ్ నిర్మించి అందులో చుట్టూ చెట్లు పెంచండి.
తరువాత గదులను విశాలంగా 20*30 అడుగుల కొలతను తీసుకొని పిల్లలు తూర్పు ముఖంగా లేదా ఉత్తర ముఖంగా ఉండేలా.. ఆ గదిని తూర్పు-పడమర పొడవు ఉండేలా నిర్మించాలి. గదిలో టీచర్ ముఖం పడమర దిక్కు లేదా దక్షిణం దిక్కు ఉండేలా గదిలో ప్లాట్‌ఫాం కట్టి వాడాలి. గదిలో డేలైట్ అధికంగా ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకు పాఠశాల చుట్టూ ఖాళీ స్థలాన్ని ఎక్కువ వదలడం ముఖ్యం. కిటికీలు పెద్దగా ఉండాలి. మామిడి టెంక పైకి చూస్తే సాధారణంగా కనిపించినా, సరిగ్గా పాదు తీసి పెడితే అది మహావృక్షమై ఎదిగొస్తుంది. అలాంటి స్థలబలం పాఠశాలకు ఇవ్వగలిగితే పిల్లలు పిడుగులై ప్రజ్వలిస్తారు.
– ఎల్లు రవి, ఖానాపూర్
మన ఇల్లు మనకే ప్రత్యేకంగా నిర్మాణమై ఉంటుంది. ఇతరుల ఇంటిలోని నిర్మాణాలు, వారి కోణాలు మనకు వర్తించవు. మీది తూర్పు ఇల్లు. పైగా మధ్యలో రోడ్డు ఉంది. మీ ఇంటి చుట్టూ కాంపౌండ్ పెట్టుకున్నారు కదా. అప్పడు మన గృహ సంబంధమైన నిర్మాణరీతులు అన్నీ మనకు మాత్రమే చెందుతాయి. ఇతరుల ఇంటికి ఈశాన్యంలో బావి, బోరింగ్లు ఉంటాయి.

దాని వెనుక తూర్పు భాగంలో ఉన్న ఇంటికి అవి నైరుతి దిశకు వస్తాయి. అప్పుడు వాటిని మూయించమంటారా? శాస్త్రంలో ఎవరి పరిధి వారికుంటుంది. ప్రహరీలు ఇవ్వడంలోనే పక్కన తమ్ముడు ఉన్నా సరే.. ఎవరి విధానం వారిదే! తన కడుపులోంచే వచ్చిన పిల్లాడి రోగానికి తల్లి మందు మింగదు కదా. ఇదీ అంతే! ఎవరి ఇంటి పరిధి వారిదే. మన గృహాన్ని సరిచేసుకోవడం మాత్రమే మన పని.
– మారె సోములు, ధన్వాడ
ఇల్లు అన్ని కాలాల్లో లైవ్‌గా ఉండాలి. ఇంటికి ప్రాణశక్తి వెలుగు-గాలితోనే వస్తుంది. అలా నిండుగా దినమంతా సహజసిద్ధమైన వెలుగు ఉంటేనే ఆ గృహం ఎంతో వృద్ధిలో ఉన్నట్లు భావిస్తాం. మీరు ఉంటున్న ఇంటిచుట్టూ ప్రదక్షిణ స్థలం ఉంటే వెలుగు ఉంటుంది. మీ గృహానికి చుట్టూ ఖాళీ స్థలం వదలలేదు అనేది అర్థం అవుతున్నది. చేయగలిగితే తూర్పు, ఉత్తరాలు ఓపెన్ వచ్చేలా ఇంటిని సవరించండి.
వీలుకాని పక్షంలో ఇల్లు మారండి. ఇల్లు మంచి చెడ్డలు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మీకు తెలిసిన వారిచేత సరైన వాస్తు ప్రకారం ఇంటిని సంస్కరించుకోండి. నిత్యం ఉపయోగపడే ఒంటిని, ఇంటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు.
– దాగం హరికృష్ణ, నాగర్ కర్నూల్
ఒకప్పటిలాగా కేవలం పేర్లను బట్టి ఇంటి నిర్మాణాలు చేయాలనే ఆలోచన లేదు. అందరికీ సరిపడేలా శాస్త్రపరమైన మెలకువలతో కట్టడం అనేది దాదాపు ఇరవై ఐదు ఏళ్లక్రితం నుంచే అమలవుతున్నది. ప్రస్తుతం అది ఎంతో ప్రాచుర్యం పొందింది. దక్షిణం, పడమర గృహాలు కూడా ఎంతో శుభ లక్షణాలతో నిర్మిస్తున్నారు.

కానీ, అపార్ట్మెంట్లలో కూడా దక్షిణ ద్వారం పనికి రాదని భావించి.. తూర్పు బాల్కనీ పెట్టి, దక్షిణ ఆగ్నేయం నుంచి వచ్చే తూర్పు ద్వారం నుంచి లోపలికి వెళుతున్నారు. దక్షిణం రోడ్డులోంచి గేట్లు పెట్టి తూర్పు ఇల్లులాగా కట్టి వాడుతున్నారు. అవన్నీ పేరుకే తూర్పు. వచ్చేది మాత్రం దక్షిణం నుంచే కదా! అనాగరికమైన విధానాలతో ఇండ్లు నిర్మించడం మంచిది కాదు. ప్రకృతిలో ప్రతిదిశకు శక్తి ఉంది. శాస్త్రపరంగా ఉన్న ఇండ్లన్నీ మంచివే.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143