Vasthu Shastra | ఇంటి స్థలం ఆగ్నేయం తెగిపోయి ఉంటే ఇల్లు కట్టొచ్చా? ఇల్లు కూడా కట్ చేయాలా? మాకు ఉన్నది ఆ స్థలం ఒక్కటే!.
– కె. లక్ష్మణ్, బడంగ్‌పేట
ఇల్లు కట్టే స్థలం ఆగ్నేయ భాగం తెగిపోతే బాధపడాల్సిన అవసరం లేదు. అలాకాక నైరుతి కానీ, ఈశాన్యం కానీ తెంపు కలిగి ఉంటే.. అందులో ఇల్లు కట్టే ఆలోచన మానుకోవాల్సి వస్తుంది. మీ స్థలంలో ఆగ్నేయం కాకుండా అందులోని మిగతా భాగంలో ఇల్లు ఎంత వైశాల్యంలో వస్తుందో చూసుకొని, అందులో వాస్తుపరంగా ఇంటిని ప్లాన్ చేయండి ముందు. ఇల్లు తప్పనిసరి కట్ చేసి కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇంటి ఆవరణం ఆగ్నేయం తెగడం వల్ల దోషంరాదు. కానీ, స్థలం కాంపౌండ్ తెగి ఉందని ఇంటిని కూడా ఆ మూలను తెంపు చేసి కట్టడం అవసరం లేదు. మీరు దక్షిణ – పశ్చిమ కొలతలు చూసుకొని ఇంటికి ప్రదక్షిణ స్థలం వదిలి తూర్పు – ఉత్తరాలు పెంచుకొని చక్కని ఇంటిని కట్టుకోండి. శాస్త్ర ప్రకారం అదే మీకు మంచి ఫలితాలు ఇస్తుంది.
మా ఇంట్లో నైరుతి తప్పు ఉందని అంటున్నారు. అది ఎవరికి నష్టం తెస్తుంది?
– కె. చంద్రశేఖర్, గొలన్కొండ
ప్రధానంగా నైరుతి భాగం గృహ యజమానుల మీద ప్రభావం చూపుతుంది. మీరు ఏ దోషమో చెప్పలేదు. నైరుతి తెంపు మంచిదికాదు. కొందరు నైరుతి తెంపు ఫరవాలేదు అన్న భావనతో ఉంటారు. అది వాస్తవం కాదు. ఇంటికి నైరుతి మూలమట్టానికి ఉండాలనేది చాలా ముఖ్య విషయం. మీ ఇల్లు నైరుతి తెగి ఉంటే.. సరిచేసుకోండి. ఈ దోషఫలం ఇంటి యజమానుల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా.. తదనంతరం కుటుంబంలోని జ్యేష్ఠ సంతానం మీద కూడా ఉంటుంది. చిత్రం ఏమిటంటే.. నైరుతి దోషం అంత తొందరగా దాని ప్రభావాన్ని వెల్లడిచేయదు. కుప్ప కూల్చేదాకా గొప్పగానే ఉంటుంది. వీరత్వం చూపుతుంది. నైరుతికి అభాగ్యం అనే అర్థం కూడా ఉంది. అంటే.. దోషాలు పలువిధాలు కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా కుటుంబమే నష్టాలు పొందుతుంది. అది ఎవరిమీద ప్రభావం చూపుతుందో అనేది పక్కనపెట్టి ముందు దానిని సరిచేసుకోండి. వీధిపోటు లాంటిది వస్తే ఇల్లు మారిపోండి. నైరుతి దోషాన్ని నమ్మకూడదు. అంటే.. ఉపేక్ష మంచిది కాదు.
నైరుతి బెడ్రూములో మెజనైన్ స్లాబ్ వేసి, పైన వాడుకోవచ్చా?
– బి. అలివేణి, బడంగ్‌పేట
చదువు కోసమో లేదా అదనపు బెడ్ సౌకర్యం కోసమో.. ఇంటి పడక గదుల్లో మెజనైన్లు వేస్తున్నారు. ఇలా అదనపు బెడ్ కావాలి అంటే.. బంకర్ బెడ్స్ బాగుంటాయి. అలా కిందా, పైనా రెండు మంచాలు ఏ గదిలోనైనా వేసుకొని వాడుకోవచ్చు. సివిల్‌లో స్లాబును నైరుతి గదిలో అదనంగా వేయడం పైన గదిని తయారుచేసి, దానికి మెట్లు పెట్టడం చేయవద్దు. వాయవ్యం గదిలో లేదా ఇంటిమీద ఆగ్నేయం గదిలో అవసరమైన విధంగా మెజనైన్ స్లాబ్.. సగభాగం వేసుకోవచ్చు. అదికూడా దక్షిణం లేదా పడమర గోడకు వేసి వాడుకోవచ్చు. అలాంటి మెజ
నైన్కు ఆగ్నేయం లేదా వాయవ్యం నిచ్చెన వేసుకొని లేదా సన్నని ఎల్ ఆకారంలో మెట్లు వేసుకొని ఉపయోగించాలి.
‘హెచ్చు దొడ్డి’ అంటే ఏమిటి? ఎలా ఉండాలి?
– బి. ఉపేందర్, తేరాల
మనం నివసించే ఇంటికి ఆనుకొని స్థలం ఉండకుండా.. మధ్యలో రోడ్డు వచ్చి కానీ, లేదా ఇతరుల ఇల్లు తరువాత గానీ మనదైన స్థలం ఉన్నప్పుడు దానిని వాస్తుభాషలో ‘హెచ్చు దొడ్డి’ లేదా ‘ఎగువ స్థలం’ అంటారు. అది మనం కొన్నది కావచ్చు. మన పెద్దల ద్వారా వచ్చింది కావచ్చు. మన నివాస స్థలం తూర్పు ముఖంగా ఉన్నప్పుడు మన ఇంటికి ఉత్తరం వీధి వచ్చి దానికి దక్షిణంలో స్థలం ఉన్నప్పుడు అది మన ఇంటి తూర్పు పారుకన్నా ముందుకు పెరిగి ఉంటే అది మంచి ‘హెచ్చు దొడ్డి’ అవుతుంది. ఆ విధంగా తూర్పు, ఉత్తరం, ఈశాన్యంలో ఉండే ఈ అదనపు స్థలాలు (హెచ్చు దొడ్లు) మంచి ఫలితాలు ఇస్తాయి. దక్షిణం, ఆగ్నేయం, పడమర, నైరుతి హెచ్చు దొడ్లు మాత్రం మంచివి కావు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | పెట్రోలు బంక్ ఏ రోడ్డు సైడ్ పెట్టాలి? ఎలా కట్టాలి?
Vasthu Shastra | హాలులో సింహం లేదా పులి బొమ్మలు పెట్టుకోవచ్చా?
Vasthu Shastra | నిత్యం మంత్ర జపం వల్ల ఇంట్లో దోషాలు పోతాయా?