చికెన్నగ్గెట్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే ఫాస్ట్ పుడ్ ఐటమ్స్‌లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో లభించే అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్స్‌లో ఇవి కూడా ఒకటి. అయితే, ఈ చికెన్ నగ్గెట్స్ వల్ల అమెరికాలోని ఓ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. అదెలా అని ఆలోచిస్తున్నారా? చికెన్ నగ్గెట్స్తో వెళ్తున్న ఓ ట్రక్కు రోడ్డుపై బోల్తాకొట్టంది. దీంతో చికెన్ నగ్గెట్స్ ప్యాకెట్లన్నీ రోడ్డుపాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఉదయం 6:30 గంటలకు బక్స్ కౌంటీలోని వెస్ట్ రాక్‌హిల్ టౌన్షిప్ సమీపంలో రూట్ 309 సౌత్‌బౌండ్ లేన్లలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తూ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సెల్లర్స్‌విల్లే వాలంటీర్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫేస్బుక్ పేజీలో భారీస్థాయిలో రోడ్డుపై పడ్డ చికెన్ నగ్గెట్స్ ప్యాకెట్ల ఫొటోలను షేర్ చేసింది. ట్రక్కులో 18,000 కిలోల చికెన్ నగ్గెట్స్ ఉన్నాయి. వీటిని తొలగించేవరకూ ఆరోడ్డు మార్గాన్ని అధికారులు బ్లాక్ చేశారు.