పురాతన కాలంలో వస్తుమార్పిడి విధానం గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. మన దగ్గర ఉన్న వస్తువు ఇస్తే ఎదుటివారు వాళ్ల దగ్గర ఉన్న వస్తువుని మనకు ఇస్తారు. ఇదే విధానాన్నిపాటిస్తూ ఓ వ్యక్తి పీచు మిఠాయి బండిని నడుపుతున్నాడు. అతడి కోసం తల వెంట్రుకలు చేతిలోపట్టుకుని పిల్లలు ఎదురుచూస్తుంటారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ విశాల్ యూట్యూబ్లో షేర్ చేశాడు. వీడియోలో ప్రతాప్సింగ్ అనే వ్యక్తి ఈ వస్తుమార్పిడి పద్ధతి గురించి వివరించారు. కొంతమంది పిల్లలు తల వెంట్రుకలు తీసుకొచ్చి పీచుమిఠాయి తీసుకెళ్తుంటారు. ఈ వీడియో చూసి చాలామంది తమ బాల్యాన్ని గుర్తుతెచ్చుకున్నారు. పలువురు తమ వద్ద చలామణి అవుతున్న వస్తుమార్పిడి విధానంపై చర్చించారు.