Bike Birthday | మీరు బైక్ లవరా? బైక్‌ను అమితంగా ప్రేమించేవాళ్లు దానిని ఏదో వస్తువులా కాకుండా కుటుంబంలో మనిషిలా చూసుకుంటారు. బండిపై చిన్న గీత పడ్డా తట్టుకోలేరు. ఇక ఏమైనా ప్రమాదం జరిగి దాని పార్ట్స్‌కు ఏమైనా అయితే విలవిల్లాడిపోతారు. రోజూ ఉదయాన్నే లేవగానే బైక్‌ను శుభ్రంగా తుడవడం, నీటితో కడగటం వంటివి చేయడం మామూలే. కానీ బైక్‌కు బర్త్‌డే చేయడం ఎప్పుడైనా చూశారా? పుట్టినరోజు సమయంలో మనమంతా బర్త్‌డే కేక్ కట్ చేసినట్టుగానే ద్విచక్రవాహనానికీ కేక్ కట్ చేసి తన ప్రేమను చాటుకున్నాడు ఓ బైక్ లవర్. ఆ కథా కమామీషు ఇదే..
వివరాల్లోకెళ్తే.. కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి తాను ఎంతో ఇష్టంగా చూసుకునే బైక్‌కు బర్త్ డే చేశాడు. బండి కొని ఏడాది పూర్తయిన సందర్భంగా దానిని శుభ్రంగా కడిగి, అందంగా అలంకరించాడు. బైక్ ముందు టైర్‌కు కేక్ కట్‌చేసే చాక్‌ను ప్లాస్టర్ ద్వారా అంటించి దాని బర్త్ డేను చేశాడు. కుటుంబ సభ్యులందరూ చూస్తుండగా తనకు ఎంతో ఇష్టమైన బైక్‌కు బర్త్ డే చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘కష్టపడి కొనుక్కున్న బైక్‌ను ఎవరైనా సరే అంతే అపురూపంగా చూసుకుంటారు’, ‘హ్యాపీ బర్త్ డే హీరో స్ప్లెండర్’, ‘అబ్బాయిలూ వాళ్లకు బైక్‌లపై ఉండే ప్రేమకు ఇదే నిదర్శనం’ అంటూ కామెంట్స్ చేశారు. మరికొంతమంది ‘టైర్‌కు చాక్ పెట్టి కేక్ కట్ చేయించావు. ఇంకా నయం.. పెట్రోల్ ట్యాంక్ మీద క్యాండిల్ పెట్టాల్సింది..!’ అంటూ తుంటరి కామెంట్స్ పెట్టారు.