హైదరాబాద్, ఫిబ్రవరి 10 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఐదేండ్ల కిందట రైతులను మోసం చేసిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో మరోసారి అన్నదాతలను దగా చేసింది. తాజా ట్రేడ్ డీల్‌తో రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ప్రకటించారు. అంతేకాదు, భారత వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులకు ఈ ఒప్పందంలో పూర్తి రక్షణ కల్పించినట్టు చెప్పుకొచ్చారు. అయితే, ‘ఫ్యాక్ట్ షీట్: ది యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా అనౌన్స్ హిస్టారిక్ ట్రేడ్ డీల్’ పేరిట అమెరికా అధ్యక్షుడి కార్యాలయం శ్వేతసౌధం సోమవారం విడుదల చేసిన ప్రకటనతో కేంద్రమంత్రుల ప్రకటనలన్నీ ఉత్తవేనని తేటతెల్లమైంది.
ట్రేడ్ డీల్‌తో రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్రం చెప్తున్నది. అయితే, శ్వేతసౌధం విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్ ప్రకటనలో అమెరికాకు చెందిన ఆహార, వ్యవసాయ ఉత్పత్తులను జీరో సుంకాలతో అనుమతించడానికి మోదీ ప్రభుత్వం ఒప్పుకొన్నట్టు స్పష్టంగా ఉన్నది. కొన్ని రకాల పప్పు ధాన్యాలతో సహా పొడి ధాన్యం (డీడీజీ), పశువుల దాణాకు వినియోగించే ఎరుపు జొన్నలు, ట్రీ నట్స్, ప్రాసెస్ చేసిన తాజా పండ్లు, సోయాబీన్ ఆయిల్ వంటి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై జీరో టారిఫ్ లేదా నామమాత్రపు సుంకాలతో దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించినట్టు అమెరికా పేర్కొన్నది. కాగా, ‘జాయింట్ స్టేట్మెంట్’ పేరిట శుక్రవారం శ్వేతసౌధం విడుదల చేసిన ప్రకటనలో పప్పుల ప్రస్తావన లేదు. అయితే, తాజా ప్రకటనలో కొన్ని రకాల పప్పులపై సుంకాల ఎత్తివేతకు మోదీ ప్రభుత్వం అంగీకరించినట్టు స్పష్టంగా ఉండటం అనుమానాలకు తావిస్తున్నది.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందన్న విషయం బయటకు రాగానే దేశీయ రైతాంగంలో భయాందోళనలు మొదలయ్యాయి. అమెరికా సాగు ఉత్పత్తులకు తలుపులు బార్లా తెరిస్తే, తమ పరిస్థితి ఏమిటని కోట్లాది మంది రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మేధావులు కూడా గళమెత్తారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన కేంద్రప్రభుత్వం.. మంత్రులతో సర్ది చెప్పించే ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో కేంద్రమంత్రులు అబద్ధాలను వల్లె వేశారు. అమెరికా నుంచి పప్పులను దిగుమతి చేసుకోవడం లేదంటూ వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ‘పచ్చి బఠానీలు, కాబూలీ చానా, పెసర్ల వంటి పప్పు ధాన్యాల ఉత్పత్తి మన దగ్గర సరిపడినంతగా ఉన్నది. అలాంటప్పుడు పప్పు ధాన్యాలను ఎందుకు దిగుమతి చేసుకొంటామం’టూ ఎదురు ప్రశ్నించారు. ఇక, అదేరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. అమెరికా పప్పు ధాన్యాలను దేశంలోకి అనుమతించట్లేదని, ఈ మేరకు ఒప్పందంలో స్పష్టంగా తెలియజేశామని చెప్పుకొచ్చారు. అయితే, వైట్‌హౌస్ విడుదల చేసిన తాజా ఫ్యాక్ట్షీట్లోని వివరాలను బట్టి మంత్రులు చేసిన ప్రకటనలు అన్నీ అబద్ధాలేనని తేలింది.
మొత్తంగా ట్రంప్‌నకు తలొగ్గిన మోదీ.. దేశీయ రైతుల ప్రయోజనాలను బలిపెట్టారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేయడానికి ఈ డీల్‌తో మోదీ సిద్ధమయ్యారా? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను అనుమతిస్తే, దేశీయ ఉత్పత్తుల సంగతేమిటని నిలదీస్తున్నారు. స్వదేశీ నినాదానికి మోదీ పాతరేసినట్టేనా? అని ప్రశ్నిస్తున్నారు.