కోల్కతా: ఒక పెద్ద గొయ్యిలో పడిన ఏనుగును రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు తమ బుర్రకు పదునుపెట్టారు. చివరకు చిన్నప్పుడు చదివిన ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని గుర్తు చేసుకున్నారు. దానిని అమలు చేసి ఆ ఏనుగును కాపాడారు. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక ఏనుగు పెద్ద గుంతలో పడినట్లు అటవీ శాఖ అధికారులకు అర్ధ రాత్రి దాటిన తర్వాత 1 గంటకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గోతిలో పడిన ఏనుగును పరిశీలించారు. దానిని ఈజీగా ఎలా పైకి తీయాలి అన్నదానిపై ఆలోచించారు. చివరకు తాము చదివిన ఆర్కిమెడిస్ సూత్రాన్ని వినియోగించారు. వెంటనే తమ ప్లాన్ను అమలు చేశారు.
ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు ఏనుగు పడిన గోతిని పైపుల ద్వారా నీటితో నింపారు. దీంతో ఆ ఏనుగు నీటిపై తేలసాగింది. అనంతరం పెద్ద తాళ్లను ఏనుగు కిందకు చేర్చి మెల్లగా దానిని పైకి లాగారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించారు. చివరకు తెల్లవారుజామున 4 గంటలకు ఆ ఏనుగును సురక్షితంగా గొయ్యి నుంచి పైకి చేర్చారు.
కాగా, ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. ‘అటవీశాఖ ఆర్కిమెడిస్ సూత్రంతో ఏనుగును కాపాడింది. నమ్మలేకపోతే ఈ వీడియో చూడండి’ అని క్యాప్షన్ పెట్టారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అటవీశాఖ అధికారులు ఏనుగును రక్షించిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి బ్రిలియంట్ ఐడియాను తెగ మెచ్చుకున్నారు. చాలా తెలివిగా ఏనుగును కాపాడిన అటవీ శాఖ సిబ్బందిని అభినందలతో ముంచెత్తారు.
An elephant fell into a ditch in Midinapur. Now how to rescue it. By applying Archimedes' principle. Watch to believe. pic.twitter.com/1mPs3v8VjC
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 21, 2022