నిర్మల్/ ఖమ్మం : అవినీతికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి ( ACB ) చిక్కారు. నిర్మల్, ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ ( Nirmal ) జిల్లా భైంసా మండలంలో తానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి భీమన్న ( Bhemanna ) గురువారం మధ్యాహ్నం బాధితుడి నుంచి రూ. 9వేలు ఫోన్ పే చేయించుకున్నందుకు ఆధారాలతో సహ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
భైంసా ఎన్బీ నగర్లో నివాసముండే ఒకరు మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, సరెండర్ లీవ్, ఎఫ్‌టీఏ బిల్లు కోసం సీనియర్ అసిసెంట్ను సంప్రదించగా లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వ్యూహం ప్రకారం దాడులు చేసి భీమనన్ను పట్టుకున్నారు.
ఖమ్మం జిల్లాలో..

ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ( Revenue Inspector ) గా పనిచేస్తున్న ఉషా శుభ కామేశ్వరి రూ. 10 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. ల్యాండ్ మ్యుటేషన్ కోసం అవసరమైన ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్కు ఆర్ఐను సంప్రదించారు. దీంతో లంచం డిమాండ్ చేసిన ఆమెకు రూ.10 వేలు బాధితులు అందిస్తుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆర్ఐపై కేసు నమోదు చేసుకుని ఏసీబీ కేసులను విచారిస్తున్న వరంగల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు.