కోల్‌కతా: కోల్‌కతాకు చెందిన అర్జెంటీనా ఫుట్‌బాల్ ఫ్యాన్ క్లబ్‌పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) ఫిర్యాదు చేశారు. ఆ క్లబ్ ఓనర్ ఉత్తమ్ సాహా తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు మాజీ క్రికెటర్ ఆరోపించారు. కోల్‌కతా పోలీసు శాఖకు చెందిన సైబర్ సెల్‌కు గంగూలీ తన ఫిర్యాదును ఈ-మెయిల్ చేశారు. ఫ్యాన్ క్లబ్ ఓనర్ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు తన పేరు ప్రఖ్యాతను దెబ్బతీశాయని, తనకు మానసిక శాంతిని లేకుండా చేసినట్లు ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే గంగూలీపై ఫ్యాన్ క్లబ్ హెడ్ ఆరోపణలు చేసినట్లు పోలీసు ఆఫీసర్ పేర్కొన్నారు. పరువునష్టం కింద గంగూలీ 50 కోట్ల దావా దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఓ జర్నలిస్టుతో మాట్లాడుతున్న సమయంలో గంగూలీపై ఫ్యాన్ క్లబ్ ఓనర్ ఉత్తమ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంతో కష్టపడి సంపాదించిన తన పేరుప్రఖ్యాతలను దెబ్బతీసే రీతిలో ఫ్యాన్ క్లబ్ అధినేత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఈవెంట్ ఆర్గనైజర్ సత్రూ దత్త గురించి చెబుతూ.. అతను గంగూలీకి చెంచాగిరి చేస్తాడని ఉత్తమ్ అన్నారు. సౌరవ్ గంగూలీ ఇలాగే అన్నారని, అతని చీటింగ్ గురించి అందరికీ తెలుసు అన్నారు. ఉదయం బీజేపీతో, సాయంత్రం మమతా బెనర్జీతో ఉంటాడని, డబ్బులు ఎక్కడ ఉంటే గంగూలీ అక్కడికి పరుగెత్తుతాడని అన్నారు. బెంగాల్ క్రికెట్‌ను గంగూలీ నాశనం చేశాడని, ఇక భారత జట్టులో బెంగాలీ క్రికెటర్లు ఉండని, అతను అలా చేశాడని ఉత్తమ్ ఆరోపించారు. దీన్ని గంగూలీ ఖండించారు. ఫ్యాన్ క్లబ్ వ్యవస్థాపకుడిపై సుమారు 50 కోట్ల పరువునష్టం కేసు దాఖలు చేసే ఆలోచనలో గంగూలీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రాక సమయంలో జరిగిన గందరగోళం నేపథ్యంలో ఉత్తమ్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.