వడోదర: సాధారణంగా విద్యార్థుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు హాస్టల్స్ ఉంటాయి. గ్రామంలో విద్యాసౌకర్యం లేని వాళ్లు సమీప పట్టణాలకు వెళ్లి హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటారు. అదేవిధంగా వర్కింగ్ విమెన్స్, మెన్స్ హాస్టళ్లు కూడా ఉంటాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒంటరిగా ఉంటూ పనులు చేసుకునే మహిళలు, పురుషులకు ఇవి ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే కేవలం ఇంటి అద్దెకు అయ్యే ఖర్చు భరిస్తే ఈ హాస్టళ్లలో ఫుడ్డు, బెడ్డు సౌకర్యం రెండూ సమకూరుతాయి. ఇక మనుషులకు హాస్టల్ సౌకర్యం సంగతి అటుంచితే.. ఇప్పుడు కుక్కలకూ హాస్టల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
గుజరాత్ రాష్ట్రం వడోదరలో కుక్కల కోసం ప్రత్యేకంగా ఓ హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. మనుషులకయితే హాస్టల్ సౌకర్యం అవసరంగానీ కుక్కలకు ఎందుకు అంటారా..? కానీ కుక్కలకూ హాస్టల్ వసతి అవసరమే..! ఎందుకంటే చాలా మంది ఇండ్లలో కుక్కలను పెంచుకుంటారు. కానీ, అత్యవసర సమయాల్లో కుటుంబం మొత్తం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లడం సాధ్యం కాదు. పోనీ వదిలేసి వెళ్దామా అంటే వాటి బాగోగులు చూసే వాళ్లుండరు. ఇలాంటి సమస్యలకు చక్కని పరిష్కారం కుక్కల హాస్టళ్లే.
అందుకే గుజరాత్‌లోని వడోదరలో కుక్కల హాస్టల్‌ను నెలకొల్పారు. ఈ కుక్కల హాస్టల్లో చేర్చే కుక్కలను తాము వాటి యజమానుల కంటే బాగా చూసుకుంటామని ఆ హాస్టల్లో పనిచేసి కుక్కల ట్రెయినర్ జిగ్నేష్ బ్రహ్మక్షత్రియ తెలిపారు. కుక్కలకు ఆహారంతోపాటు అన్ని ప్రాథమిక అవసరాలకు చక్కని సౌకర్యం ఉందని చెప్పారు. ప్రతిరోజూ రెండు పూటలా వాకింగ్ చేయిస్తామన్నారు. కుక్కల షెడ్లను రోజూ నాలుగుసార్లు శుభ్రం చేస్తామని, వారానికోసారి స్నానం కూడా చేయిస్తామని తెలిపారు. పైగా వివిధ పనుల్లో వాటికి ట్రెయినింగ్ కూడా ఇస్తామన్నారు.
Dog hostel facility set up in Vadodara, Gujarat
— ANI (@ANI) December 11, 2021
Concept is to provide shelter to the pets of people who travel in emergencies. We provide basic facilities of walking twice a day, freshening up 4-times, basic puppy training & grooming once a week: Jignesh Brahmakshatriya, trainer pic.twitter.com/i0WJm450MF