ముంబై: కొన్ని పెళ్లిల్లోని ఆచారాలు, సంప్రదాయాలు వింతగా ఉంటాయి. అయితే ఇటీవల వివాహాలను చాలా ఫ్యాషన్‌గా చేసుకుంటున్నారు. ఒక జంట పూలమాలలకు బదులుగా ఏకంగా పాములను ఒకరి మెడలో మరొకరు వేసుకున్నారు. ఆశ్చర్యం కలిగించే ఈ వింత వివాహం మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగింది.
స్థానిక వన్యప్రాణి అధికారులలైన సిద్ధార్థ్ సోనావనే, శ్రుతి ఔసర్మల్ వెరైటీగా పెళ్లి చేసుకున్నారు. గ్రామస్తుల సమక్షంలో పాములను వరమాలగా వేసుకున్నారు. తొలుత వధువు శ్రుతి ఒక మాదిరి పామును వరుడి మెడలో వేస్తుంది. అనంతరం వరుడు సిద్ధార్థ్ పొడవైన పెద్ద కొండ చిలువను వధువు మెడలో వేస్తాడు. ఈ పెళ్లి తంతు తర్వాత ఆ పాములను సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.
కాగా, 2010 నవంబర్ 12న జరిగిన ఈ వింత వివాహానికి సంబంధించిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు దీనిపై అంతే వెరైటీగా కామెంట్లు చేశారు. ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా అంటూ ఇమోజీలతో నోరెళ్లబెట్టారు.