T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ టీంకు ఆందోళన కలిగించే సంఘటన జరిగింది. ఆ టీంలోని ఒక సభ్యుడికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. దీంతో అతడిని ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందించినట్లు టీం సభ్యులు తెలిపారు. టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న ఆఫ్ఘన్ టీం ప్రస్తుతం ఢిల్లీలో ఉంది.
ఆఫ్ఘనిస్తాన్ టీం పర్ఫామెన్స్ అనలిస్ట్‌గా పనిచేస్తున్న కేసీ రామ సుబ్రమణియన్, హోటల్లో ఉన్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. అక్కడ జట్టు మెడికల్ టీం మొదట అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతడిని టీం సభ్యులు దక్షిణ ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని, అయినప్పటికీ ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచారని వెల్లడించారు. రామ సుబ్రమణియన్ అనారోగ్యం పాలవడంతో ఆఫ్ఘనిస్తాన్ టీం సభ్యుల్లో కెప్టెన్ రషీద్ ఖాన్, సీనియర్ ఆటగాడు మొహమ్మద్ నబీ వంటి ఆటగాళ్లు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
రామ సుబ్రమణియన్ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అతడి కుటుంబానికి ప్రైవసీ కల్పించాలని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డ్ కోరింది. ఇక.. అతడికి అవసరమైన వైద్య సహాయం అందిస్తామని ఇటు బీసీసీఐ, అటు ఐసీసీ కూడా ప్రకటించాయి. ఈ సంస్థల తరఫున ఆస్పత్రికి ప్రతినిధిని పంపి, పరిస్థితిని సమీక్షించారు.