Viral news : సోషల్ మీడియా వేదికగా ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఏ పని చేయకుండానే ఇంటి నుంచే డబ్బులు సంపాదించండంటూ మోసపూరిత ప్రకటనలు ఇస్తుంటారు. దాంతో చాలా మంది అత్యాశకు పోయి నిలువునా మోసపోతుంటారు. తాజాగా మగవాళ్లను బాగా ఆకర్షించే ఒక విచిత్రమైన ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ధనవంతుల కుటుంబాలకు చెందిన యువతులకు కడుపు చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ విచిత్రమైన ప్రకటన చూసి ఒక యంగ్‌స్టర్ ఆసక్తి చూపించాడు. దాంతో రిజిస్ట్రేషన్‌కు అంటూ రూ.800, ఆ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ కోసం అంటూ రూ.24 వేలు వసూలు చేశారు. ఆ తర్వాత మరో రూ.3 లక్షలు పంపాలని డిమాండ్ చేశారు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ సిటీలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏం జరిగిందంటే..
ఇటీవల మౌ-ఐమా పట్టణంలోని బకర్గంజ్ ఏరియాకు చెందిన అల్తాఫ్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఒక ప్రకటన చూశాడు. ఆ ప్రకటనలో ధనవంతుల కుటుంబాలకు చెందిన అమ్మాయిలను గర్భవతులను చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. దాంతో అల్తాఫ్ ఆ ప్రకటనలో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేసి, ముందుగా రూ.800 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాడు.
తర్వాత అతడిని విదేశాలకు తీసుకెళ్లేందుకు పర్మిషన్ కావాలని, అందుకు పేపర్ వర్క్ పూర్తి చేయడానికి డబ్బులు అవసరమవుతాయని స్కామర్లు చెప్పారు. దాంతో వాళ్ల మాటలు నమ్మి అల్తాఫ్ మరో రూ.24 వేలు పంపాడు. ఆ తర్వాత స్కామర్లు మరోసారి ఫోన్ చేసి తమకు రూ.3 లక్షలు పంపాలని బెదిరించారు. అల్తాఫ్ రూ.3 లక్షలు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో వారు అతనిపై కేసు పెడతామని, జైలుకు పంపిస్తామని బెదిరించారు. తాము పోలీసు అధికారులం అంటూ బెదిరించారు. దీంతో అల్తాఫ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.