Rafi Song | సోషల్ మీడియాలో అప్పడుప్పుడు మనకు మంచి కళాకారులు తారసపడుతుంటారు. ఒక్కరు సంగీత వాద్యాలు వాయిస్తుండగా.. మరొక్కరు తమ నటనా కౌషలాన్ని ప్రదర్శిస్తుంటారు. పాటలు పాడే వారైతే సరే సరి.. లెక్కకు మిక్కిలి మంది పాటలు పాడుతూ మనల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఈ పెద్దాయన మాత్రం ‘మనల్ని ఆకట్టుకోవడం కాదు, మనం ఆయన్ని ఆకట్టుకుంటున్నాం’ అన్న తీరుగా పాట పాడారు. ఇంత లేటు వయసులోనూ ధీటుగా పాడుతుంటే నెటిజెన్లు కళ్లు మూసుకుని వింటూ ఆ రోజుల్లోకి వెళ్లిపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో..?
కేరళ కన్నూర్కు చెందిన 85 ఏండ్ల వయసున్న డాక్టర్ సురేష్ నంబియార్ అనే పెద్దాయన 1960 ల నాటి మహమ్మద్ రఫీ ‘పుకార్తా చల్తా హూ మై..’ పాటను అందుకున్నారు. ఆ వయసులోనూ ఆ పాత మధురాన్ని అంతే రాగయుక్తంగా అందించేందుకు ప్రయత్నించారు. ఐ అండ్ పీఆర్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తునన దయానంద్ కాంబ్లి శుక్రవారం ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కేవలం ఒక్క రోజులోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 1300 వ్యూస్ రాగా, 87 లైక్స్ సాధించింది. పెద్దాయన పాట తమను ఎంతగానో ఆకట్టుకున్నదని పలువురు నెటిజెన్లు కామెంట్ చేశారు. ‘వాయిస్ అద్భుతంగా ఉన్నదని ఒకరు, వయసుపరంగా పెద్దవాడు.. కానీ హృదయం పరంగా ఇంకా చిన్నవాడే.. చీర్స్..’ అంటూ వినియోగదారులు కామెంట్ రాశారు.
An 85 years old person from Old Age Home at Coimbatore singing an old bollywood song… पुकारता चला हूं मैं…”. pic.twitter.com/K1plbCEWPw
— Dayanand Kamble (@dayakamPR) February 10, 2023
కాగా, కేరళలోని తమ ఇంట్లోనే డాక్టర్ సురేష్ నంబియార్ పాడిన పాట సోషల్ మీడియాలో ఇంత గొప్పగా ఆకట్టుకుంటుందని భావించలేదని ఆయన కుమార్తె సుమ చెప్పారు. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆయనలోని గాయకుడిని బయటిప్రపంచానికి తెలియజెప్పిన వినోద్ కాంబ్లికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాట తన తండ్రికి ఇష్టమైన వాటిలో ఒకటి అని పేర్కొన్నది. అయితే, దయానంద్ కాంబ్లి పేర్కన్నట్లుగా ఈ వీడియో కోయంబత్తూరులోని ఓల్డేజ్ హోంలో చిత్రీకరించింది కాదని, తమ ఇంట్లోనే రికార్డు చేసినట్లు స్పష్టం చేస్తూ కాంబ్లీ తప్పును సరిదిద్దారు.