Organ Donation | కొండాపూర్, డిసెంబర్ 19 : తాను మరణించినా ఓ వృద్ధుడు మరింత మందికి ప్రాణం పోశాడు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. హైదరాబాద్లోని చందానగర్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చందానగర్ గంగారంలోని శ్రీసాయి గాయత్రి రెసిడెన్సీలో పీతల యెల్లాజిరావు(65) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 17వ తేదీ బుధవారం ఉదయం ఇంట్లో యెల్లాజిరావు స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. కుటుంబసభ్యులు అతన్ని పైకి లేపి మంచి నీళ్లు తాగించారు. దీంతో నార్మల్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికి వాకింగ్ కోసం బయటకొచ్చాడు. ఆ సమయంలోనే రోడ్డుపైనే మళ్లీ కిందపడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు యెల్లాజిరావు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.
జూబ్లీహిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 19వ తేదీన యెల్లాజీరావు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే జీవన్ దాన్ ట్రస్ట్ సభ్యులు యెల్లాజీరావు కుటుంబాన్ని సంప్రదించగా.. అవయవదానానికి అంగీకరించారు. దీంతో యెల్లాజీరావు కళ్లు, గుండె, లివర్, కిడ్నీలతో పాటు ఇతర అవయవాలను సేకరించి.. ఇతరులకు అమర్చనున్నారు.