కొత్త కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదవుతున్నాయి. ఇటీవల ఓ మినీ కూపర్ కారులోకి ఎక్కువ మంది ఎక్కి కొత్త రికార్డును రాశారు. కారులో ఉన్నది ఐదుగురు కూర్చునే సీట్లు.. కానీ ఏకంగా 29 మంది ఎక్కేశారు. ఒకరిపై ఒకరు వరుసగా, పొందికగా కూర్చుని వరల్డ్ రికార్డును తమ సొంతం చేసుకున్నారు.
ఈ రికార్డు వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతున్నది. మూడు నిమిషాల వ్యవధి గల ఈ వీడియోలో మినీ కూపర్ కారులో ఎక్కువ మంది ఎక్కడం మనం చూస్తాం. ఈ రికార్డు కోసం చైనాలోని జియామెన్‌లో స్పెషల్ సెట్ వేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు వెనక సీట్లో కూర్చోవడం ప్రారంభించి ముందు, వెనకాల, డిక్కీలో మొత్తం 29 మంది ఎక్కారు. దాంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారి చివరకు విజేతగా ప్రకటించిన సర్టిఫికేట్‌తోపాటు పతకాన్ని ప్రధానం చేసి అభినందించారు.
How many volunteers can squeeze into this regular-sized Mini Cooper? 😬 pic.twitter.com/wXf4Tihv87
— Guinness World Records (@GWR) September 5, 2022
2014 లో ఈ వరల్డ్ రికార్డ్ నమోదు కాగా.. గిన్నిస్ బుక్ నిర్వాహకులు ఈ వీడియోను వారం క్రితం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 11 వేల మంది వీక్షించగా ఎందరో లైక్‌లు, రీట్వీట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా ఇంత చిన్న కూపర్లోకి ఇంత మంది ఎలా ఎక్కారబ్బా? అని నోరెళ్లబెడుతున్నారు. నిజమే మరి. రికార్డు సాధించాలన్న తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నెటిజెన్ చేసిన కామెంట్ ఈ సందర్భంగా అద్దినట్లుగా సరిపోతుండటం విశేషం.