IRCTC Tour | ఈ ఏడాది క్రిస్మస్ కోసం విదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్న పర్యాటకులకు ఐఆర్సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. నేపాల్‌లో సందర్శన కోసం అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ప్రపంచంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో నేపాల్ ఒకటి. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం అయిన ఎవరెస్ట్ ఇక్కడే ఉంది. ఏటా సాహసమాయత్ర చేయాలనుకునే పర్వతారోహకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. నేపాల్‌లో అనేక పురాతన దేవాలయాలను చూడొచ్చు. ఇక్కడి వంటకాలు సైతం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు నేపాల్‌ను సందర్శిస్తారు. ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీని ‘క్రిస్మస్ స్పెషల్ మిస్టికల్ నేపాల్ విత్ గాలా డిన్నర్’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
ఈ టూర్ ప్యాకేజీ మిమ్మల్ని ఐదురాత్రులు, ఆరు పగళ్లపాటు పాటు నేపాల్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఖాట్మండు, ఫోఖరాలో పర్యటించొచ్చు. ఈ ప్యాకేజీకి ఐఆర్సీటీసీ టూర్ కోడ్ WMO018 అని తెలిపింది. ఈ టూర్ ప్యాకేజీ డిసెంబర్ 12న ముంబయి నుంచి ప్రారంభమవుతుంది. పర్యటన విమానంలో ఉంటుంది. నేపాల్‌లో బస్సులు అందుబాటులో ఉన్నాయి. టూర్ ప్యాకేజీలోనే భోజన వసతి, హోటల్ వసతి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఒక్కరు రూ.59,400, ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు రూ.51,400, ముగ్గురు వ్యక్తులైతే ఒక్కొక్కరు రూ.50,100 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ టూర్లో బుద్ధ స్తూపం, పశుపతినాథ్ ఆలయం, దర్బార్ స్క్వేర్, టిబెటన్ శరణార్థి కేంద్రం, స్వయంబునాథ్ స్థూపం, మనకామనా ఆలయం, సురంగ్కోట్, వింద్యావాసిని మందిర్, డెవిల్స్ ఫాల్, గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్స్ను సందర్శిస్తారు.