హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా, ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు నిధుల విడుదల లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేశరాజధాని ఢిల్లీలో తొమ్మిది రోజులపాటు జరిపిన పర్యటన విజయవంతమైంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి వివిధ రంగాల్లో ప్రగతి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ, కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి వివరంగా చర్చించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లకు మంజూరీలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ, ఏపీ మధ్య జలవివాదాలపై కేంద్రానికి స్పష్టతనిచ్చారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగివచ్చారు.
తెలంగాణ భవనానికి శంకుస్థాపన
ఈ నెల 1న ఢిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్ 2వ తేదీన వసంత్‌విహార్‌లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ నెల 3న ప్రధాని మోదీని కలిసి కనీసం గంటపాటు వివిధ అంశాలపై లోతుగా చర్చించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ఫలితాలను వివరించారు. విభజన చట్టంలో కేంద్రం రాష్ర్టానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రధానిని ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానానికి ప్రధాని సంతోషంగా అంగీకరించారు. గిరిజన వర్సిటీతోపాటు జిల్లాకో నవోదయ, పీఎంజీఎస్‌వైకి నిధుల మంజూరు, రహదారుల విస్తరణ, రెండు పారిశ్రామిక కారిడార్లు, మావోయిస్టు ప్రాంతాల్లో మెరుగుపరిచే రోడ్ నెట్వర్కింగ్, కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ వంటి అంశాలను నివేదించారు.
పలువురు కేంద్ర మంత్రులతో..
ఈ నెల 4న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన సీఎం కేసీఆర్.. రాష్ర్టానికి ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు. 6న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త ప్రతిపాదనలు, హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ పొడిగింపు వంటి అంశాలపై చర్చించారు. జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌ను కలిసిన సందర్భంగా గోదావరి, కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డులు సృష్టించిన గందరగోళాన్ని వివరించారు.