
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంలో తెలంగాణ శరవేగంగా పురోగమిస్తున్నది. పంటల వృద్ధిరేటులో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. గత పదేండ్లలో (2011 నుంచి 2020 వరకు) 6.59% శాతం వృద్ధిరేటు సాధించి దేశంలోనే రెండో స్థానానికి దూసుకెళ్లినట్టు తాజాగా విడుదల చేసిన విశ్లేషణ పత్రంలో నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఈ జాబితాలో త్రిపుర 6.78% వృద్ధిరేటుతో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ పెద్ద రాష్ర్టాల్లో అత్యధిక వృద్ధిరేటు తెలంగాణలోనే నమోదవడం విశేషం. ఈ పదేండ్లలో కేవలం 11 రాష్ర్టాల్లోనే 3% శాతం కంటే ఎక్కువ వృద్ధిరేటు నమోదైనట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. మరో 8 రాష్ర్టాల్లో 1.05 నుంచి 2.98 శాతం వరకు వృద్ధిరేటు నమోదైనట్టు తెలిపింది. 10 రాష్ర్టాల్లో మైనస్ 3.63 నుంచి 1 శాతంలోపు వృద్ధిరేటు నమోదైనట్టు పేర్కొన్నది.
రైతుల ఆదాయంలో పంటల వాటా పతనం
2011-12 నాటికి రైతుల ఆదాయంలో 65.4 శాతంగా ఉన్న పంటల వాటా.. 2018-19 నాటికి 55.3 శాతానికి క్షీణించినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో పంచవర్ష ప్రణాళికలు మొదలైన తర్వాత తొలి 15 ఏండ్లలో 4.28 శాతంగా ఉన్న వరి, గోధుమ, మొక్కజొన్న పంటల వార్షిక వృద్ధిరేటు గత 15 ఏండ్లలో 2.37 శాతానికి, చిరుధాన్యాల వృద్ధిరేటు 2.88 శాతం నుంచి 1.94 శాతానికి దిగజారినట్టు తెలిపింది. దీనిపై విధాన నిర్ణేతలు మేల్కోవాల్సిన అవసరమున్నదని నీతి ఆయోగ్ హెచ్చరించింది.
రైతులకు కేటీఆర్ శుభాకాంక్షలు
పంటల వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఘనత సాధించిన రాష్ట్ర రైతులకు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.