e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home Top Slides లాక్‌డౌన్‌ విధుల్లో కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు

లాక్‌డౌన్‌ విధుల్లో కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు

  • ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు.. శనివారం మరింత జోరు
  • అనవసరంగా రోడ్లెక్కేవారికి అవగాహన, చలాన్లు
  • గూడ్స్‌ వాహనాలు రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకే
  • లాక్‌డౌన్‌ వేళల్లో నగరాలు, పట్టణ శివార్లు మూసేస్తాం
  • ఎమర్జెన్సీ వాహనాలకే అనుమతి: డీజీపీ మహేందర్‌రెడ్డి
  • రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో తనిఖీలు
లాక్‌డౌన్‌ విధుల్లో కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల జోరు పెంచారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్నవారికి తమదైన శైలిలో బుద్ధి చెప్పడంతోపాటు చలాన్ల కొరడా ఝుళిపించారు. ఏకంగా పోలీస్‌ బాస్‌ డీజీపీ నుంచి కానిస్టేబుల్‌వరకు అంతా రోడ్లపై గస్తీకాస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ.. పోలీస్‌ అధికారులకు సూచనలు ఇచ్చారు. మిగిలిన అన్ని పోలీస్‌ కమిషనరేట్ల ఉన్నతాధికారులు సైతం డీజీపీని అనుసరిస్తూ రోజంతా తనిఖీల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. దీంతో అడిషనల్‌ ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్సైలు సహా అన్ని ర్యాంకుల పోలీసులకు తోడు ట్రాఫిక్‌ విభాగం సిబ్బంది సైతం ప్రధాన కూడళ్లు, చౌరస్తాల్లో పికెట్లు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించారు. అత్యవసర పాస్‌లేకుండా రోడ్లపైకి వచ్చేవారిపై కేసులు నమోదుచేశారు.

హైదరాబాద్‌లో సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌లో సీపీ సజ్జనార్‌, రాచకొండలో సీపీ మహేశ్‌భగవత్‌, వరంగల్‌ కమిషనర్‌ తరుణ్‌జోషీతోపాటు ఇతర పోలీస్‌ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించవద్దని పదేపదే చెప్తున్నా కొందరు ఆకతాయిలు, అనవసర పనులపై బయటికి వచ్చేవారు వినకపోవడంతో పోలీసులు వారి వాహనాలను సీజ్‌చేశారు. వారం రోజుల్లో దాదాపు 20 వేల పైచిలుకు వాహనాలు సీజ్‌ చేసినట్టు ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. పాస్‌లు ఉండి చిల్లర కారణాలు చూపుతూ పదేపదే రోడ్లపైకి వచ్చేవారికి సైతం పోలీసులు శనివారం కొంత కఠినంగానే సమాధానమిచ్చారు. హైదరాబాద్‌లో చాలాచోట్ల వాహనదారులకు పోలీసులకు స్వల్ప వాగ్వాదాలు సైతం చోటుచేసుకున్నాయి.

బేగంపేట సమీపంలో బారికేడ్లు ఏర్పాటుచేసి చేపట్టిన తనిఖీలో వందలాది ద్విచక్రవాహనదారులు, కార్లను హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌ గ్రౌండ్‌లో కాసేపు ఉంచిన పోలీసులు సరైన పత్రాలు చూపనివారిపై కేసులు నమోదుచేశారు. ఓవైపు తనఖీలతోపాటు దవాఖానలకు వెళ్లేవారు, డాక్టర్ల కోసం ప్రత్యేకంగా లైన్‌ ఏర్పాటు చేసి వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసుల ముమ్మర తనిఖీలు ఇలాగే కొనసాగుతాయని, అనవసరంగా బయటికి వస్తే వాహనాలు సీజ్‌చేస్తామని, అలా బయటికి వచ్చి ఇబ్బందులపాలు కావొద్దని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం నుంచి ప్రతి యూనిట్‌ పరిధిలో చెక్‌పోస్టుల సంఖ్య పెంచి తనిఖీలు మరింత పక్కాగా అమలుచేయనున్నట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

అనుమతిలేని వాహనాలు సీజ్‌చేస్తాం: డీజీపీ
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేస్తున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర, పర్మిషన్‌ ఉన్న వాహనాలు మినహా మిగతా వాటిని అనుమతించేది లేదని స్పష్టంచేశారు. అనుమతి లేకుండా, అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను జప్తు చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాటిని లాక్‌డౌన్‌ ఎత్తేసేవరకు తిరిగి వాహనదారులకు ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. లాక్‌డౌన్‌ అమలు పర్యవేక్షణలో భాగంగా శనివారం ఆయన రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌తో కలిసి ఆయా కమిషనరేట్ల పరిధిలో ఆకస్మిక తనిఖీలుచేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అన్ని పట్టణాల పరిధిలో గూడ్స్‌ వాహనాల (లోడ్‌, అన్‌లోడ్‌)ను రాత్రి 9 నుంచి ఉదయం 8 గంట ల మధ్య మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించిన ట్రాఫిక్‌ సూచనలు విడుదల చేసినట్టు తెలిపారు. కిరాణా దుకాణాలు, వివిధ మార్కెట్లలో వినియోగదారులు ఉదయం 9-30 గంటల వర కే కొనుగోళ్లు ముగించేలా దుకాణదారులు చూసుకోవాలని, కచ్చితంగా 10 గంటల నుంచి లాక్‌డౌన్‌ పాటించాలని సూచించారు. లాక్‌డౌన్‌ సమయంలో అనుమతి ఉన్న కంపెనీలు సైతం నిబంధనలకు అనుగుణంగా తమ సిబ్బంది పనివేళలు ప్లాన్‌ చేసుకోవాలని తెలిపా రు. లాక్‌డౌన్‌ సమయంలో అన్ని నగరాలు, పట్టణాల శివార్లు పూర్తిగా మూసివేస్తామని, ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇండ్లలోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ విధుల్లో కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు

ట్రెండింగ్‌

Advertisement