సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఎయిర్పోర్టులో ఇటీవల అమలు చేసిన 8 నిమిషాల ఉచిత డ్రాప్-ఆఫ్ పరిమితి, ఓవర్ స్టే చార్జీల విధానాన్ని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వరర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎయిర్ పోర్ట్ ర్యాంపుల వద్ద రోజూ ఎదురయ్యే భారీ ట్రాఫిక్ రద్దీ, ప్రయాణికుల లగేజీ నిర్వహణలో ఆలస్యం, వృద్ధులు, దివ్యాంగ ప్రయాణికులకు సహాయం చేయాల్సిన అవసరం, నెట్ వర్క్, చెల్లింపు సమస్యలు వంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ విధానం అమలు చేయడం డ్రైవర్లకు తీవ్ర అన్యాయమని యూనియన్ తెలిపింది. ప్రస్తుతం 8 నిమిషాలకు మించి ర్యాంపుల వద్ద ఉన్న వాహనాలపై 250 నుంచి రూ.500 వరకు చార్జీలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్లపై ఇది అదనపు ఆర్థిక భారం మోపడేమనని చెబుతోంది.