న్యూఢిల్లీ, జూన్ 10: బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా పడిపోయాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) రేటు 10 గ్రాములు ఈ ఒక్కరోజే రూ.4,300 (దాదాపు 3 శాతం) దిగి రూ.1,56,000 (అన్ని పన్నులు సహా)కు పరిమితమైంది. ఇక కిలో వెండి విలువ రూ.10,000 (4 శాతం) తగ్గి రూ.2,45,700 (అన్ని పన్నులు కలిపి)గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగడం, కరెన్సీ మార్కెట్లో అమెరికన్ డాలర్లకు డిమాండ్ రావడంతోనే.. గోల్డ్, సిల్వర్ రేట్లలో ఈ ఆకస్మిక క్షీణతని మార్కెట్ నిపుణులు తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దీని ప్రభావం భారత్‌పై గట్టిగానే పడుతున్నది. దేశీయ ఇంధన అవసరాలు సుమారు 90 శాతం దిగుమతుల ద్వారానే జరుగుతుండగా.. ఇందులో మెజారిటీ గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి. కాగా, మిడిల్ ఈస్ట్‌లో పెరిగిన ఉద్రిక్తతలతో బ్యారెల్ క్రూడాయిల్ రేటు మరోసారి 90 డాలర్ల ఎగువకు చేరింది. ఈ పరిణామం.. దిగుమతిదారుల నుంచి డాలర్లకు విశేష ఆదరణను కల్పిస్తున్నదని ట్రేడింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీరేట్ల పెంపు వంటి అంచనాల నడుమ పసిడి, వెండికి ఇన్వెస్టర్లు దూరం జరుగుతున్నారని అంటున్నారు.
హైదరాబాద్‌లోనూ పుత్తడి, వెండి ధరలు దిగొచ్చాయి. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం రేటు రూ.3,950 తగ్గి రూ.1,36, 450గా నమోదైంది. అలాగే కిలో వెండి రూ.2,60,000గా ఉన్నది. కాగా, గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 90.53 డాలర్లు పడిపోయి 4,168.99 డాలర్ల వద్ద స్థిరపడింది. సిల్వర్ ధర కూడా తగ్గుముఖం పట్టి 63.87 డాలర్ల వద్ద నిలిచింది. డాలర్ల డిమాండ్‌కుతోడు, అమెరికా ట్రెజరీ బాండ్ రాబడుల్లో పెరుగుదల.. ఇన్వెస్టర్లను తమ పెట్టుబడులను గోల్డ్, సిల్వర్ నుంచి మళ్లించాయన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ గత నెలలో దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు.. పెట్టుబడులను ఆపేశాయన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే మదుపర్లూ లాభాల స్వీకరణకు దిగారని ఆనంద్ రాఠీ వెల్త్ జాయింట్ సీఈవో ఫిరోజ్ అజీజ్ అంటున్నారు. నిజానికి అంతకుముందు నెల ఏప్రిల్‌లో రూ.3,040 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. అలాగే మార్చిలో రూ.2,266 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,255 కోట్లు, జనవరిలోనైతే ఏకంగా రూ.24,040 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు బుధవారం భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ తెలిపింది. ఓవరాల్‌గా గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్)లు నిరుడు మే నెల నుంచి ఇప్పటిదాకా రూ.70,000కుపైగానే పెట్టుబడులను ఆకర్షించాయన్నది. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ గత నెలాఖరు నాటికి రూ.1,84,571 కోట్లకు చేరిందన్నది. అయితే మేలో సీన్ రివర్స్ కావడంతో రాబోయే నెలల్లో మార్కెట్ ఎలా? ఉంటుందోనన్న భయాలు మదుపర్లలో నెలకొన్నాయి.
ఏడాదికిపైగా మదుపర్లను విపరీతంగా ఆకట్టుకుంటూ నెలనెలా పెట్టుబడులను అందిపుచ్చుకున్న గోల్డ్ ఈటీఎఫ్‌లకు.. గత నెల మాత్రం ఆదరణ లేకుండాపోయింది. వరుసగా 13 నెలలు ఇన్‌ఫ్లోను చూసిన గోల్డ్ ఈటీఎఫ్‌లు.. మే నెలలో ఔట్‌ఫ్లోను చవిచూడాల్సి వచ్చింది. ఈ ఒక్క నెలలోనే రూ.725 కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ఉపసంహరణ జరుగడం ఇదే తొలిసారి మరి. అయితే నాడు కేవలం రూ.5.82 కోట్ల పెట్టుబడులే వెనక్కిపోయాయి. కానీ ఇప్పుడు అంతకు దాదాపు 125 రెట్లు ఎక్కువగా పెట్టుబడుల ఉపసంహరణ జరుగడం గమనార్హం.