e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides ఉద్యమ నినాదం.. ప్రభుత్వ విధానం

ఉద్యమ నినాదం.. ప్రభుత్వ విధానం

  • ఒకొకటిగా అమలు.. దేశం గర్వించేలా తెలంగాణ
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల బాగే లక్ష్యంగా పథకాలు
  • అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘననివాళి
  • బంగారు తెలంగాణగా మార్చేవరకు విశ్రమించను
  • వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణవ్యవస్థ ఆర్థికంగా
  • పరిపుష్టంలో ప్రభుత్వం సఫలం: ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం
ఉద్యమ నినాదం.. ప్రభుత్వ విధానం

హైదరాబాద్‌, జూన్‌ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసం, అభిమానమే కొండంత ధైర్యమని చెప్పారు. ప్రజలిచ్చిన భరోసాతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే వరకు విశ్రమించబోనని మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామని తెలిపారు. ఏడేండ్లకాలంలోనే దృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, నాటి ఉద్యమ నినాదాలను ఒకొకటిగా అమలుచేస్తున్నదని చెప్పారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు తదితర మౌలికవసతులను స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో పూర్తిచేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. దేశంలో 29 రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, అభివృద్ధి, సంక్షేమరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలువటం గర్వంగా ఉందని తెలిపారు.

సమైక్యరాష్ట్రంలో విస్మరించబడిన రంగాలను, ఒకొకటిగా ఓపికతో, దార్శనికతతో అవాంతరాలను లెకజేయకుండా సరిదిద్దుకుంటూ వస్తున్నామని వివరించారు. తెలంగాణ సమాజం తొంభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో నిండి ఉన్న నేపథ్యంలో వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు. ప్రజా ఆకాంక్షలను కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్ధి, దృఢ సంకల్పం, తెలంగాణ పట్ల నిబద్ధత, అన్నింటికీ మించి.. అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘననివాళిని అర్పించాలనే స్ఫూర్తితో పనిచేస్తున్నామని చెప్పారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కళాకారులు, కులవృత్తులు, ఇతరవృత్తులతో పాటు ఆసరా పింఛన్‌ అందాల్సిన ప్రతివర్గానికి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా నిలబడిందని పేర్కొన్నారు. ఆర్థికంగా, సామాజికంగా సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ తెలంగాణను సాధించుకున్న ఫలితాలను అందిస్తూ, వారి ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా మారిందని తెలిపారు.

మంత్రుల శుభాకాంక్షలు
అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో స్వరాష్ట్రం సాధించుకొని ఏడేండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా రాష్ట్రప్రజలకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, సత్యవతిరాథోడ్‌, జీ జగదీశ్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రప్రజలకు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు తెలంగాణభవన్‌లో పతాకావిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఉదయం 8.30 గంటలకు తెలంగాణభవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి, ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జాతీయపతాకాన్ని ఎగురవేస్తారు.

అన్నపూర్ణగా నిలుపడం వెనక అకుంఠిత దీక్ష
తెలంగాణ రైతును కాపాడి, వ్యవసాయాన్ని పునరుజ్జీవింపచేసి భారతదేశానికే తెలంగాణ అన్నపూర్ణగా నిలుపడం వెనక ప్రభుత్వ అకుంఠిత దీక్ష ఇమిడి ఉన్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తెలంగాణ వ్యవసాయాన్ని స్థిరీకరించి, గ్రామీణవ్యవస్థను ఆర్థికంగా పరిపుష్టం చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైందని పేర్కొన్నారు. ఈ ఘనవిజయంలో తెలంగాణ ప్రజల సహకారం మహా గొప్పదని ధన్యవాదాలు తెలిపారు. కరోనా ఉపద్రవంతో రాష్ట్ర ఖజానాకు కొంత ఇబ్బంది కలిగినా ప్రజల సహకారంతో ఎప్పటికప్పుడు నిలదొకుకుంటూ ముందుకుపోతున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉద్యమ నినాదం.. ప్రభుత్వ విధానం

ట్రెండింగ్‌

Advertisement