e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home Top Slides మద్యం షాపుల్లో ..కోటా

మద్యం షాపుల్లో ..కోటా

 • దళితులకు 10 శాతం
 • గౌడ్‌లకు 15 శాతం
 • గిరిజనులకు 5 శాతం
 • రోడ్ల మరమ్మతుకు మరో 100 కోట్ల రూపాయలు
 • రెడ్డి బాలికల హాస్టల్‌కు 1,261 గజాల జాగ
 • వచ్చే ఏడాదినుంచి 7 వైద్య కాలేజీలు ప్రారంభం
 • వేగంగా 4 సూపర్‌ స్పెషాల్టీ దవాఖానల నిర్మాణం
 • వైద్యరంగంలో మౌలిక వసతులకు సమగ్ర ప్రణాళిక
 • రాష్ట్రంలో అదుపులోకి వచ్చిన కరోనా మహమ్మారి
 • విద్యాసంస్థలు తెరిచినా కొవిడ్‌ కేసులు పెరగలేదు
 • స్పెషల్‌ వ్యాక్సినేషన్‌లో రోజుకు 3 లక్షల టీకాలు
 • సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులకు ఆమోదం
 • సింగూరు నుంచి నీటి ఎత్తిపోతకు 4,427 కోట్లు
 • 24 నుంచి వర్షాకాల అసెంబ్లీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. దళితబంధు అమలులో భాగంగా వైన్స్‌ దుకాణాల్లో కూడా దళితులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్సీలతోపాటు.. గౌడ కులస్థులు, ఎస్టీలకు కూడా రిజర్వేషన్‌ కల్పిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. పోడు సమస్యలు, కొత్త జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్లలో సమస్యల పరిష్కారానికి మరో రెండు ఉపసంఘాలను ఏర్పాటుచేసింది.

ఈ నెల 24 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై ఉభయ సభల్లో చర్చించే అవకాశాలున్నాయి. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆరుగంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనతోపాటు కొత్త మెడికల్‌ కాలేజీలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో నాలుగువైపులా సూపర్‌స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం వెంటనే చేపట్టాలని నిర్ణయించింది.

- Advertisement -

రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నదని భావించిన మంత్రివర్గం.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. రెడ్డి బాలికల వసతి గృహానికి నారాయణగూడలో 1,261 గజాల స్థలాన్ని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకొన్నది. సాగునీటిపారుదలపై కూడా మంత్రివర్గం చర్చించింది. సంగారెడ్డి, అందోల్‌, జహీరాబాద్‌, నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 20 టీఎంసీల సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం సింగూరు జలాశయం కుడి, ఎడమ వైపు నీటిని ఎత్తిపోయడానికి రూ.4,427 కోట్ల పరిపాలనా అనుమతులనిచ్చింది.

పలు అంశాలపై సబ్‌కమిటీల ఏర్పాటు
ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యల పరిషార మార్గాలకోసం మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డితో క్యాబినెట్‌ సబ్‌కమిటీని మంత్రివర్గంఏర్పాటు చేసింది. పోడుభూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకోసం మంత్రి సత్యవతిరాథోడ్‌ చైర్మన్‌గా, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌ సభ్యులుగా మరో సబ్‌ కమిటీని క్యాబినెట్‌ నియమించింది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు, ఇతర పోలీస్‌ స్టేషన్లలోని సమస్యలు, ఇతర అవసరాలను సమీక్షించడానికి క్యాబినెట్‌ సబ్‌కమిటీని మంత్రివర్గం నియమించింది. హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ నేతృత్వంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌ సభ్యులుగా ఈ సబ్‌ కమిటీ పనిచేస్తుంది. రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పోలీస్‌ శాఖ అవసరాలు, సమస్యలు.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు ఈ సబ్‌కమిటీ పోలీస్‌శాఖను పూర్తిస్థాయిలో సమీక్షిస్తుంది. రాష్ట్రంలో ఈ వానకాలంలో కురిసిన వర్షపాత వివరాలు, సాగు అయిన భూమి వివరాలు, దిగుబడి అంచనాలపై క్యాబినెట్‌ చర్చించింది. వానకాలంలో పంటల కొనుగోళ్లకు మార్కెటింగ్‌శాఖ సన్నద్ధతపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.

మంత్రివర్గం నిర్ణయాలు మరికొన్ని

 • రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మతులకు ఈ సంవత్సరం ఇప్పటికే కేటాయించిన రూ.300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయిస్తూ పంచాయితీరాజ్‌శాఖకు ఆదేశాలు
 • రాజా బహద్దూర్‌ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ వారి కోరిక మేరకు, నారాయణగూడలో 1,261 గజాల స్థలాన్ని, బాలికల వసతి గృహ నిర్మాణం కోసం కేటాయింపు.
 • సంగారెడ్డి, అందోల్‌, జహీరాబాద్‌, నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం తెలిపింది.
 • సంగమేశ్వర ఎత్తిపోతలకు సింగూరు జలాశయం కుడివైపు నుంచి 12 టీఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్‌, అందోల్‌, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రతిపాదించారు. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ.2,653 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం.
 • బసవేశ్వర లిఫ్ట్‌ స్కీంకు సింగూరు జలాశయం ఎడమ వైపునుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణ్‌ఖేడ్‌, అందోల్‌ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 166 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ.1,774 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రివర్గం ఆమో దం తెలిపింది. ఈ రెండు లిఫ్టులకు నాబార్డు ద్వారా రుణాలు పొందడానికి కూడా మంత్రివర్గ సమావేశం సాగునీటి శాఖకు ఆనుమతి ఇచ్చింది.
 • కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 15, 16లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణమవుతున్న నరసింహసాగర్‌ (బస్వాపూర్‌ జలాశయం) నాబార్డు ద్వారా రూ.2051.14 కోట్ల రుణం పొందడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement