కే ప్రకాశ్‌రావు, కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం రూపంలో ఎదురెక్కిన గోదావరి.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కర్షకుల కష్టాలను, కన్నీళ్లను దూరం చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా జలసవ్వడులే వినిపిస్తున్నాయి. నిండు వేసవిలోనూ వాగులు, వంకలు పారుతుండగా.. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. దశబ్దాలుగా నెర్రలుబారిన భూములు బంగారంగా మారాయి. భూగర్భజలాలు ఉబికి వస్తున్నాయి. కునారిల్లిన చెరువులు మిషన్ కాకతీయతో రూపుమారి.. గంగనీళ్లను నింపుకొం టూ.. తననే నమ్ముకున్న భూముల గొంతు తడుపుతూ పచ్చని పంటలకు నీరు అందిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా ఎటుచూసినా జళకళ ఉట్టి పడుతున్నది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం జలాల ఎత్తిపోతలు కొనసాగగా, శ్రీరాజరాజేశ్వర జలాశయం, లోయర్ మానేరు డ్యామ్ నిత్య కల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా నీటితో కళకళలాడుతున్నాయి. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎగువ, దిగువ భూములకు నీళ్లు అందాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి ఎగువమానేరు వరకు కాళేశ్వరం జలాలు సందడి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ప్రాజెక్టుల నీళ్లు రావడం, మరోవైపు భూగర్బజలాలు పెరగడంతో మోటర్ల కింద భారీగా వరి సాగైంది. మెజార్టీ చెరువులు నీటితో కళకళ లాడాయి. వాటికింద ఆయకట్టు పెరిగింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 9.12 లక్షల ఎకరాలకుపైగా సాగైంది. తద్వారా 22.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనావేశారు.
ఇప్పటికే వాటర్ హబ్‌గా మారిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక వాగులు, ఒర్రెల ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేందుకు పెద్ద మొత్తంలో చెక్ డ్యాంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకటి రెండు కాదు.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఏకకాలంలో రూ.846.38 కోట్లతో 114 చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నారు. వీటికి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా, పనులు యుద్ధ ప్రాతిపదికన నడుస్తున్నాయి. సాధ్యమైనంత తొందరగా వీటిని పూర్తిచేసి.. నీటి వనరులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నది. ఇవన్నీ పూర్తయితే.. రెండున్నర టీఎంసీల నీరు అందుబాటులోకి రావడమే కాదు.. మానేరు, మోతె, పెద్దవాగు, హుస్సేనీమియా వంటి వాగులు సజీవంగా మారనున్నాయి.
జిల్లా.. చెక్‌డ్యామ్‌లు అంచనా వ్యయం
కరీంనగర్ 36 289.80
పెద్దపల్లి 19 312.13
జగిత్యాల 35 88.83
రాజన్న సిరిసిల్ల 24 155.62
మొత్తం 114 846.38
గత యాసంగిలో ఆయా జిల్లాల్లో సాగు విస్తీర్ణం,
ప్రస్తుత సాగు విస్తీర్ణం, గతంతో పోల్చితే పెరిగిన విస్తీర్ణం, దిగుబడి వివరాలు