హుజూరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితబంధు సంపూర్ణ ఆవిష్కరణతో హుజూరాబాద్ సభ రాష్ట్రానికి ఓ దిక్సూచిలా నిలిచింది. దళితుల సంక్షేమం, అభ్యున్నతి తప్ప మరే నిబంధనలు దళితబంధుకు ముందరికాళ్ల బంధం వేయలేవని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పడంతో దృశ్యం స్పష్టమైపోయింది. దేశమే తిరిగి చూసేలా రూపొందించిన ఈ పథకం ఎవరికి, ఎప్పుడు ఏరీతిగా అమలవుతుందనే సందేహాలు సీఎం కేసీఆర్ చల్లని మాటలతో పటాపంచలైపోయాయి. దళితజాతి ఉద్ధరణ ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘దళిత బంధు’ పథకంతో కొత్త చరిత్ర పురుడు పోసుకుంది. సీఎం కేసీఆర్ ఒక్కో పలుకును దళితులు ఆసక్తిగా విన్నారు.
ఒక్కో అంశాన్ని సీఎం కేసీఆర్ వివరిస్తున్నప్పుడు చప్పట్లతో అభిమానాన్ని చాటారు. దళిత బంధు పథకాన్ని ప్రతి కుటుంబానికి అమలు చేస్తామని ఘంటాపథంగా సీఎం కేసీఆర్ చెప్పడంతో విపక్షాలు వండివారుస్తున్న అనుమానాలు, అపోహలు చెదరిపోయాయి. దళితబంధుకు నిబంధనలే లేవని కేసీఆర్ తేల్చిచెప్పారు. ప్రతి దళిత కుటుంబానికి కచ్చితంగా లబ్ధి చేకూరుతుందని భరోసా కల్పించారు. దీంతో పథకం పరిధిపై రాష్ట్రవ్యాప్తంగా స్పష్టత వచ్చింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసాలో చెక్కుచెదరని ఉక్కు సంకల్పం కనిపించింది. ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తిస్తుందని చెప్పడంతో మరింత స్పష్టత వచ్చింది. సభకు వచ్చినవారు, ముఖ్యంగా మహిళలు ముఖ్యమంత్రిని సల్లగుండుమని దీవించారు. పాత ప్రభుత్వాలు నాలుగు పైసలు చేతుల్లో పెట్టి పోయిరమ్మన్నట్టు అనేవి. అలాకాకుండా దళితబంధు పథకం కింద డబ్బులు ఇవ్వడంతో ఆగిపోకుండా.. ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్, రక్షణ నిధి వంటివి ఏర్పాటు చేస్తామని చెప్పడం సీఎం చెప్పడం ఆయన దూరదృష్టికి, లోతైన అవగాహనకు అద్దం పడుతున్నదనే ప్రశంసలు కురుస్తున్నాయి.
దళిత విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు ఈ పథకంతో దళితజాతి అభ్యున్నతికి ఏం చేయాలో చర్చించాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సూచన అమలుకు కృషి చేస్తామని కాకతీయ వర్సిటీ విద్యార్థి ఆర్ అభినవ్ చెప్పాడు. దళితబంధుతో దళితులు ధనికులు కావాలని సీఎం ఆకాంక్షించడం ఆయన తపనను తెలుపుతున్నదని చెప్పా డు. గతంలో ఏ ప్రభుత్వమైనా క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా పథకం రూపొందించేదని, ఇప్పుడు సీఎం ప్రారంభించిన దళితబంధు చెప్పడం సంక్షేమ రంగంలోనే కొత్త అధ్యాయమని సభకు వచ్చిన దళితులు చర్చించుకున్నారు.