e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home Top Slides బంధువొచ్చె.. బండ్లు తెచ్చె

బంధువొచ్చె.. బండ్లు తెచ్చె

  • హుజూరాబాద్‌లో దళితబంధుకు మరో రూ. 500 కోట్లు
  • మొత్తం రూ.2,000 కోట్లు విడుదల
  • ప్రతిష్ఠాత్మక పథకం అమలు ప్రారంభం
  • నాలుగు కుటుంబాలకు యూనిట్ల పంపిణీ
  • రోజూవారీ కొనసాగనున్న యూనిట్ల పంపిణీ
  • ఇద్దరికి ట్రాక్టర్లు.. మరో ఇద్దరికి ట్రాన్స్‌పోర్ట్‌, ట్రావెల్‌ వాహనాలందించిన కొప్పుల, గంగుల
  • పథకం గ్రౌండింగ్‌తో లబ్ధిదారుల సంబురం
  • దళితబంధుపై నేడు కరీంనగర్‌లో సీఎం సమీక్ష

‘దళితబంధు ప్రతి దళిత కుటుంబానికి వస్తది. ముందే లెక్కవెట్టుకున్న. రాష్ట్రంలో ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలన్నింటికి ఇచ్చినా అయ్యే ఖర్చు రూ.1.70 లక్షల కోట్లు. ఏడాదికి 30 వేల కోట్లో, 40 వేల కోట్లో ఖర్చు వెట్టుకుంటపోతే మూడు నాలుగేండ్లల్ల మన దళితవాడలన్నీ బంగారు మేడలైతయి. రూ.500 కోట్లే ఇచ్చిండ్రు.. కడ్మయి ఇస్తరా? అని ఎవడో ఒక పేపరాయన రాసిండు.. కడ్మయి ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదా మరి? 15 రోజుల్లో రెండువేల కోట్లు బాజాప్తాగా ఇస్తాం.’

ఇవి.. సీఎం కేసీఆర్‌ ఆగస్టు 16న హుజూరాబాద్‌ వేదికగా చెప్పిన మాటలు. సరిగ్గా పది రోజుల వ్యవధిలోనే దళితబంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుకు కావలసిన నిధులన్నీ కరీంనగర్‌ కలెక్టర్‌ ఖాతాకు జమయ్యాయి. పథకం అమలులో ముఖ్యమంత్రి సంకల్పానికి, ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమిది. తెలంగాణ ఆవిర్భావం మొదలు.. ఇప్పటిదాకా సీఎం కేసీఆర్‌ మేధ నుంచి పుట్టుకొచ్చిన పథకాలు అన్నీ ఏ విధంగానైతే విజయవంతంగా అమలయ్యాయో.. అదేవిధంగా దళితబంధు కూడా సంబురాల మధ్య దళితవాడల గడపతొక్కింది.

- Advertisement -

ముకరంపుర, ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం యూనిట్ల పంపిణీ ప్రారంభమైంది. దళితబంధు ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల్లో నలుగురికి గురువారం ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో యూనిట్లను అందించారు. ఈ నలుగురిలో ఇద్దరు ట్రాక్టర్లు, ఒకరు ట్రాన్స్‌పోర్టు, మరొకరు ట్రావెల్‌ వాహనాన్ని ఎంపిక చేసుకొన్నారు. దళిత బంధు యూనిట్లు గ్రౌండింగ్‌ కావడం సంతోషంగా ఉన్నదని మంత్రి కొప్పుల ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే 2000 కోట్ల రూపాయలు కరీంనగర్‌ కలెక్టర్‌ దళిత బంధు ఖాతాలో జమయ్యాయని, దీనిని బట్టి కార్యక్రమం అమలు కోసం ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేస్త్తున్నదో స్పష్టమవుతున్నదన్నారు. గురువారం నాటికే సుమారు 15 వేల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇది రోజువారీ జరిగే కార్యక్రమమని చెప్పారు. దళితబంధు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం, ధైర్యం దళితుల్లో కనబడిందని పేర్కొన్నారు.

అంబేద్కర్‌ కలలు సాకారం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈర్ష్య పడేలా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి, అంబేద్కర్‌ కన్న కలల్ని నిజంచేస్తున్నారని కొనియాడారు. సీఎం ఏది చెప్పినా వెంటనే అమలు చేస్తారనే దానికి దళితబంధు ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. పథకాన్ని ప్రకటించిన వెంటనే యూనిట్లను అందించడం ద్వారా ప్రజలకు నమ్మకం ఏర్పడిందని, వారి ముఖాల్లో చిరునవ్వు చూసే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ వై సునీల్‌ రావు, జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, రవాణా శాఖ ఉప కమిషనర్‌ ఎం చంద్ర శేఖర్‌ గౌడ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేశ్‌, అధికారులు పాల్గొన్నారు.

నలుగురికి పని కల్పిస్తం
కూలీ పని చేసుకుంట కూరగాయలు అమ్ముకొని బతికే మాకు దళితబంధు కింద ట్రాక్టర్‌ ఇచ్చిన్రు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మా కుటుంబం రుణపడి ఉంటది. కూలీ పని చేసుకొనే మేం ట్రాక్టర్‌కు ఓనర్‌ కావడం సంతోషంగా ఉన్నది. అప్పు కట్టే బాధ లేదు. ట్రాక్టర్‌ నడుపుకుంట మంచి ఆదాయం సంపాదించకుంటం. మాతోటి నలుగురికి పని దొరికేలా చేస్తం.

  • ఎల్కపల్లి కొమురమ్మ, చల్లూరు

డ్రైవర్‌ నుంచి ఓనర్నయిన
ఇప్పటిదాక నేను ఇంకొకరి దగ్గర కారు డ్రైవర్‌గ పనిచేసిన. దళితబంధు పథకం కింద మాకు కారు మంజూరైంది. మంత్రులు తాళాలు ఇచ్చిన్రు. ఇప్పుడు ఇంకొకరి దగ్గర పనిచేసే అవసరం లేదు. మాకు ప్రభుత్వం ఇచ్చిన కారును నడుపుకుంటం. నెల నెలా డబ్బుల కోసం ఇబ్బందిపడే మాకు ఎంతో ధైర్యం వచ్చింది. బ్యాంకు లోన్లు, అప్పులు కట్టే బాధలేదు. కారుతోటి మంచి ఆదాయం సంపాదించుకుంటం.

  • రాచపల్లి శంకర్‌, శాయంపేట (జమ్మికుంట)

కేసీఆర్‌ మాకు దేవుడు
దళితబంధు కింద రూ.10 లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆరే మా దేవుడు. కూరగాయల వ్యాపారం చేసుకొని బతికే మాకు అశోక్‌ లే ల్యాండ్‌ వాహనం మంజూరైంది. వ్యాపారం ఇంకా బాగా చేసుకొని మంచి ఆదాయం పొందే అవకాశం వచ్చింది. అప్పు లేకుంట బండి ఇచ్చుడు సంతోషంగా ఉన్నది. ఇప్పటిదాకా ఎవరూ ఇట్ల మాకు ఏం చేయలే. సీఎం కేసీఆర్‌ సాయాన్ని ఎన్నటికీ మరిచిపోం.

  • జీ సుగుణ,అంబేడ్కర్‌ కాలనీ (జమ్మి కుంట)

ట్రాక్టర్‌ మంచిగ నడుపుకుంటం
దళితబంధు కింద మాకు ట్రాక్టర్‌ మంజూరైంది. వ్యవసాయ కూలీ, పాలేరుగా పనిచేసిన మేం ట్రాక్టర్‌కు యజమాని అయినం. ట్రాక్టర్‌ తోటి వ్యవసాయ పనులు చేసుకుంట మంచిగ సంపాదించుకుంటం. నలుగురికి ఆదర్శంగా ఉంటం. పథకంతో మాకు ఎంతో మేలు జరిగింది.

  • దాసారపు స్వరూప, ఎస్సీకాలనీ, వీణవంక
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement