
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. మంగళవారం సీఎస్ సోమేశ్‌కుమార్‌తో టెలికాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఆయా గ్రామాలు, మండలాల్లో ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్తు, రోడ్లు, నాలాలు తదితరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి పురపాలక, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్ శాఖల అధికారులు కిందిస్థాయి వరకు తమ ఉద్యోగులను అప్రమత్తం చేయాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో పారాహుషార్..
ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నీటిపారుదలశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలను చేపట్టాలన్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులంతా వారివారి నియోజకవర్గాల్లోనే ఉంటూ, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకొంటూ, ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఎడతెగని వర్షాల నేపథ్యంలో ఇండ్లలోనే సురక్షితంగా ఉండాలని వర్ష ప్రభావిత వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
కలెక్టర్లతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్
సమీక్షలో కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్.. వర్షాలతో ప్రభావితమైన 20 జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అవసరమైతే అకడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వర్షాలవల్ల ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. అవసరమైతే, ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.