Devanur Forest | వరంగల్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక నగరమైన వరంగల్‌కు సమీపంలోని దేవునూర్ ఇనుపరాతి గుట్టల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అయోమయంగా ఉన్నది. దట్టమైన అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు, మరింత అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం నుంచి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తుండగా, అదే ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులకు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు కొత్తగా భూకేటాయింపులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో రీజినల్ జూపార్కు ఉన్నది. పెద్ద పులులతోపాటు చాలా రకాల జంతువులు, పక్షులు ఎన్నో ఈ జూపార్కులో ఉన్నాయి. వరంగల్‌లో పెరిగిన జనాభా, రద్దీ, వాహనాల శబ్ధం, కాలుష్యం కారణంగా ఈ జూపార్కును నగర శివారు ప్రాంతాలకు తరలించే ప్రతిపాదనలను అటవీశాఖ సిద్ధంచేసింది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ ఏడాది జనవరి 11న వరంగల్ జూపార్కును సందర్శించారు. అక్కడికి కొత్తగా తెచ్చిన పెద్ద పులులను సందర్శకులు చూసే ప్రక్రియను ప్రారంభించారు. వరంగల్ జూపార్కును దేవునూరు అటవీ ప్రాంతానికి తరలిస్తామని, జంతువులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా అక్కడ ఏర్పాట్లు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. కలెక్టర్ సహా ఇతర ముఖ్య అధికారుల సమక్షంలోనే మంత్రి సురేఖ జూపార్కు తరలింపు విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు దేవునూరులోని దట్టమైన అటవీ ప్రాంతం కాకుండా అడవి మొదలయ్యే ప్రదేశంలో కొత్త జూపార్కును ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు.
దేవునూరు అటవీప్రాంతంలో జూపార్కు ఏర్పాటు ప్రక్రియ జరుగుతుండగానే అదే అడవిలోని భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని హనుమకొండ జిలా కలెక్టరు మార్చి 27న అటవీశాఖ జిల్లా అధికారికి ఆదేశాలు ఇచ్చారు. 1967లో రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలని ప్రతిపాదించిన భూములను ఇప్పుడు కొందరికి అప్పగించేలా నిర్ణయించడంపై అటవీ శాఖ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెవెన్యూ, సర్వే ల్యాండ్, అటవీ శాఖల సంయుక్త సర్వే తుది నివేదిక రావాల్సి ఉన్నదని, ఆలోపే అటవీ భూములపై ఆదేశాలు ఇవ్వడం సరికాదని వారు అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటనకు, హనుమకొండ కలెక్టర్ ఆదేశాలు విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
అందమైన గుట్టలు, అటవీ, జల వనరులకు ఆలవాలంగా ఉన్న దేవునూరు ప్రాంతా న్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ సర్కారు ప్రణాళికలు వేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మసాగర్-దేవునూరు మధ్య 4,000 ఎకరాల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) ప్రణాళికలు రూపొందించింది. ధర్మసాగర్ చెరువు మీదుగా దేవునూరు ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి కోసం రూ.50 కోట్లతో ప్రణాళిక సిద్ధమైంది. తొలిదశలో రూ.5 కోట్లతో పనులను కూడా మొదలుపెట్టారు. ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలోని 3,950 ఎకరాల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉన్నది.
వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న దేవునూరు అటవీప్రాంతం పూర్తిగా గుట్టలు, జలాశయాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గజ్జెల జింకలు, మచ్చల జింకలు, గుడ్డెలుగులు, పునుగు పిల్లులు, అడవి పిల్లులు, ముండ్ల పందులు, అడవి పందులు, ముంగీసలు, కొండ గొర్రెలు, కుందేళ్లు, ఉడుములు, కొండచిలువలు, నాగుపాములు, జెర్రిపోతులు, గద్ద జాతి పక్షులు, గుడ్లగూబలు, జిట్ట పిట్టలు, జీనువాయి పిట్టలు, కొంగలు వంటి 80 జాతుల జంతువులు, సరీసృపాలు, పక్షులు ఈ ప్రాంతంలో మనుగడ సాగిస్తున్నాయి. 25 రకాలకు పైగా సీతాకోక చిలుక జాతులు ఇకడ కనువిందు చేస్తున్నాయి. వేల పక్షులు ఈ జలవనరుల్లో ఉంటున్నాయి.
నిజాం హయాంలోని రికార్డుల్లోనూ దేవునూరు అటవీ ప్రాంతం అని ఉన్నదని, ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎంతో గొప్పగా ఉంటుందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా లేనన్ని ఔషధ మొక్కలు ఈ ప్రాంతంలో ఉన్నాయని అటవీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వనసేవ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో వనదర్శిని విజ్ఞానయాత్రలను, బర్డ్ వాక్, ఫారెస్ట్ వాక్ లాంటి అనేక పర్యావరణ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్ వంటి ఉల్లాసవంతమైన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తారు. ఎంతో మంది పర్యావరణ ప్రేమికులు, పరిశోధన విద్యార్థులు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు ఇక్కడికి నిత్యం వస్తుంటారు.