హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తోపాటు ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, స్వపక్షనేతలు సైతం తమ నియోజకవర్గాల్లో పెండింగ్ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. పెండింగ్ నిధుల చెల్లింపు, యూరియా తదితర అంశాలను ప్రస్తావించారు. సంబంధిత శాఖల మంత్రులు మాత్రం ఏ ఒక్క ప్రశ్నకూ నేరుగా సమాధానమివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలువురు మంత్రులు సభలోనే లేకుండాపోయారు. తొలుత మంత్రి సీతక్క, ఆ తరువాత కొండా సురేఖ, ఒకటి, రెండుసార్లు మంత్రులు పొన్నం, దుద్దిళ్ల, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు ముక్తసరిగా సమాధానమిచ్చారు. ప్రశ్న ఏదైనా.. ‘నోటెడ్.. నోటెడ్’ అని బదులిచ్చారే తప్ప, అంతకుమించి మరో మాట చెప్పలేదు. ఇక శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు జీరో అవర్‌లో ఒకే అంశానికి పరిమితం కావాలని సభ్యులకు సూచించారు.
ట్రెజరీ బెంచ్‌లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, సంజయ్‌కుమార్ సోమవారం సైతం అసెంబ్లీలో ట్రెజరీ బెంచ్ వైపే కూర్చోవడం చర్చనీయాంశమైంది. దీనిపై గతంలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్‌తోపాటు స్పీకర్‌కు ఫిర్యాదుచేశారు. విచారణ జరిపిన స్పీకర్ వారు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. తాజాగా సదరు ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచ్ వైపు కూర్చోవడం గమనార్హం.