హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంలో జీరో జీఎస్టీని అమలు చేయాలని కోరుతూ కలకత్తా టౌన్హాల్లో ఆగస్టు 7న సమావేశాన్ని నిర్వహించనున్నట్టు జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం నాయకుడు యర్రమాద వెంకన్న నేత వెల్లడించారు. చేనేతపై జీరో జీఎస్టీ అమలుకు, చేనేత ఉత్పత్తులపై పన్నులు విధించే పార్టీలను బహిష్కరించేందుకు ఈ సమావేశంలో తీర్మానాలు చేయనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1905 ఆగస్టు 7న విదేశీ వస్త్రాలను బహిషరిస్తూ కలకత్తా టౌన్హాల్లో రాజా మనీంద్రచంద్ర నంది అధ్యక్షతన తీర్మానం జరిగిందని, ఇప్పుడు అదే స్ఫూర్తితో జీరో జీఎస్టీ అమలు కోసం కలకత్తా టౌన్హాల్లో సమావేశాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.
మాంచెస్టర్ ఉత్పత్తులను అమ్ముకోవడానికి బ్రిటిష్ వలస పాలకులు భారతీయ చేనేత రంగాన్ని దెబ్బతీశారని, అదే రీతిలో నేడు స్వతంత్ర భారతదేశంలో సైతం చేనేత రంగాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతున్నదని మండిపడ్డారు. దేశానికి గర్వకారణమైన చేనేత రంగాన్ని కేంద్ర పాలకులు ప్రత్యేకమైనదిగా పరిగణించకపోగా పన్నులు వేసి నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని వ్యతిరేకించేందుకే ఆగస్టు 7న కలకత్తా టౌన్హాల్లో అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వివరించారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారులు, చేనేత సంఘాల ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశానికి అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.