హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో జీరో అడ్మిషన్ల పరంపర కొనసాగుతున్నది. ఈ విద్యాసంవత్సరం ఏకంగా 64 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ నమోదు కాకపోవడం గమనార్హం. ఈ కాలేజీల్లో 20,260 సీట్లుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు. వీటిలో 63 ప్రైవేట్ కాలేజీలు కాగా, ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉండటం విశేషం. ఒక్కరు కూడా చేరని కాలేజీగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట డిగ్రీ కాలేజీ నిలిచింది.
దోస్త్ మూడు విడుతల సీట్ల భర్తీ తర్వాత ఈ 64 కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు నమోదయ్యాయి. గతంలో జీరో అడ్మిషన్ కాలేజీల సంఖ్య 50, 58 ఉండగా ఈ సారి 64కు చేరడం గమనార్హం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే అత్యధికంగా 22 కాలేజీలున్నాయి. ఆ తర్వాత మహత్మాగాంధీ, ఉస్మానియా వర్సిటీల పరిధిలో ఎక్కువగా ఉన్నాయి. సున్నా అడ్మిషన్లు నమోదైన కాలేజీలను మూసివేయాలని కొంతకాలంగా అధికారులు భావిస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు.
రాష్ట్రంలో 957 డిగ్రీ కాలేజీలుండగా, డిగ్రీ ఫస్టియర్లో ఈసారి 32శాతం సీట్లే భర్తీ కాగా 68 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో(2.95లక్షలు)సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. ఉస్మానియా పరిధిలో 1.95 లక్షల సీట్లకు 34శాతం, కాకతీయ వర్సిటీ పరిధిలో 1.07లక్షల సీట్లకు 31శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఏటా డిగ్రీలో 2 లక్షల అడ్మిషన్లు నమోదవుతుండగా, తాజాగా 1.41 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఎప్సెట్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అడ్మిషన్ల సంఖ్య పెరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. రిపోర్టింగ్ గడువు ముగియడంతో దోస్త్ ఇంట్రా కాలేజీ ైస్లెడింగ్కు అవకాశమిచ్చారు. సీటు వచ్చిన కాలేజీలోనే మరో బ్రాంచిలో సీట్లుంటే ైస్లెడింగ్ ద్వారా చేరవచ్చు. వీరికి ఈ నెల 9, 10 తేదీల్లో వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 11న సీట్లు కేటాయిస్తామని దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.