హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ (KCR) గొప్ప పాలనాదక్షుడు. ప్రత్యేక తెలంగాణ (Telangana) రాష్ర్టానికి ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించారు. ఆయన హయాంలో హైదరాబాద్ నగరం విశేషాభివృద్ధిని సాధించింది’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan) కితాబునిచ్చారు. ‘అంతకు ముందు 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ విజ యం సాధించారని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి వైఎస్సార్ కూడా కృషి చేశారని తెలిపారు. ఈ 20 ఏండ్ల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైదరాబాద్‌తో అసలు సంబంధమే లేదని తేల్చిచెప్పారు.
ఆ ఇద్దరు హైదరాబాద్ నగరాభివృద్ధికి చేసిన క్రెడిట్‌ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో ఒక్క బిల్డింగ్ కట్టి నగరమంతా తానే కట్టానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఏపీలోని తాడేపల్లిలో గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరాభివృద్ధిపై చంద్రబాబు నాయుడు తరచూ బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఆరు ఎకరాల్లో హైటెక్ సిటీకి అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పునాది వేశారని గుర్తుచేశారు.
కానీ చంద్రబాబు హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. చం ద్రబాబు సీఎం పదవి దిగిపోయే నాటికి ఐటీ ఎగుమతులు రూ.5,650 కోట్లుగా ఉంటే, 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక 2008-09లో రూ.32, 509 కోట్లకు చేరుకున్నాయని వివరించారు. సీఎం చంద్రబాబు ఎఫీషియన్సీలో వీక్ అని, క్రెడిట్ చోరీలో పీక్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ మరింత అభివృద్ధి జరిగిందని, ఆ క్రెడిట్ అంతా తనదేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. క్రెడిట్ ఇవ్వకపోవడం బాబు దుర్మార్గపు నైజమని విమర్శించారు.