హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదని, ప్రతి పౌరుడు ఓటు హకును వినియోగించుకొని దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఓటరు జాబితా అత్యంత ప్రధానమైనదని పేరొన్నారు. తెలంగాణలో అందరి సహకారంతో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. యువత ఓటు హకును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఉద్బోధించారు. అనంతరం కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లకు గుర్తింపు కార్డులను గవర్నర్ అందజేశారు. సీనియర్ ఓటర్లను సన్మానించడంతోపాటు ఎన్నికల్లో ప్రతిభ కనబర్చిన అధికారులను అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో సీఈవో తెలంగాణ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, అడిషనల్ సీఈవో లోకేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ సీఈవోలు తదితరులు పాల్గొన్నారు.