వెల్దండ, అక్టోబర్ 8 : ‘ఈ సీఐ మా కొద్దు’ అంటూ యువకులు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్‌స్టేషన్ ఎదు ట ఆందోళనకు దిగారు. యువకుడిని బట్టలు విప్పించి కొట్టిన సీఐని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పోలీస్‌స్టేషన్ ఎదుట హైదరాబాద్-శ్రీశైలం హైవేపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మా ట్లాడుతూ.. వెల్దండ మండలం పెద్దాపూర్‌లో ఇటీవల దుర్గామాత మండపం వద్ద ఫ్లెక్సీని తొలగించిన విషయంలో అధికార పార్టీకి చెందిన కిశోర్‌రెడ్డికి అదే గ్రామానికి చెందిన గజ్జె హరిప్రసాద్‌గౌడ్ మధ్య వివాదం చోటుచేసుకున్నట్టు తెలిపారు. కిశోర్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. మంగళవారం హరిప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి బూతులు తిట్టడంతోపాటు బట్టలు విప్పించి కొట్టారని ఆరోపించారు. విష యం తెలుసుకున్న జాతీయ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి అక్కడికి చేరుకొని ఇరువురికి సర్దిచెప్పారు. అయితే సీఐ తీరుపై హెచ్చార్సీని ఆశ్రయించనున్నట్టు బాధితుడు హరిప్రసాద్ తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు వేతనాలు చెల్లించాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి బుధవారం ప్రకటన విడుదల చేశారు. స్వయంగా ముఖ్యమంత్రినే బాధ్యత వహిస్తున్న విద్యాశాఖలోని 20వేల మంది సమగ్రశిక్షా ఉద్యోగులకే నెలవారీగా వేతనాలు చెల్లించకుంటే పరిస్థితి ఏంటని వాపోయారు. తమకు వచ్చేదే అరకొర వేతనమని వివరించారు. దసరా, బతుకమ్మ రాష్ట్ర పండుగని, వేతనాలను చెల్లించకపోవడంతో ఆ పూట కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీపావళి పండుగ సైతం సమీపిస్తున్నదని అయినప్పటికీ ప్రభుత్వం వేతనాల ఊసెత్తడం లేదని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణం స్పందించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.