మోత్కూరు, జూలై 12: తమిళనాడులోని అరుణాచలంలో ఘోరం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విద్యాసాగర్(32) హత్యకు గురయ్యాడు. స్థానిక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. విద్యాసాగర్ గిరిప్రదక్షిణ చేస్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రూ.500 ఇవ్వాలంటూ విద్యాసాగర్‌పై దుండగులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. విద్యాసాగర్ నిరాకరించడంతో ఇద్దరు నిందితులు తమవద్ద ఉన్న కత్తులతో అతడి గొంతు కోసి పరారయ్యారు. తోటి భక్తులు విద్యాసాగర్‌ను సమీపంలోని దవాఖానకు తరలించగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు స్పష్టంచేశారు. ఘటనపై తిరువన్నామళై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు గుగణేశ్వరణ్ (22), తమిళసరణ్(25)గా గుర్తించి అరెస్ట్ చేశారు.
స్వగ్రామంలో అంత్యక్రియలు
అరుణాచలంలో దైవదర్శనం కోసం వెళ్లి దారుణ హత్యకు గురైన విద్యాసాగర్(32) అంత్యక్రియలు స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెంలో నిర్వహించారు. విద్యాసాగర్ తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. ఫార్మసీ చదువుకున్న విద్యాసాగర్ ప్రముఖ కంపెనీలో మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. తండ్రి రవీందర్ ఎస్పీఎఫ్ ఏఎస్సైగా హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో విధులు నిర్వహిస్తున్నారు. విద్యాసాగర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.