హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో యువత ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్’తో బాధపడుతున్నది. ఓ వైపు యువతలో ఊబకాయం పెరుగుతుండగా.. పోషకాహార లోపం తీవ్రంగా కనిపిస్తున్నది. దీన్నే వైద్య నిపుణులు ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్’ అంటున్నారు. ‘యంగ్ లైవ్స్ సర్వే-2023’ సర్వే ఆందోళనకర విషయాలు వెల్లడించింది. 22 ఏండ్ల యువతలో 19% మంది అధిక బరువుతో బాధపడుతుండగా.. 29% మంది తక్కువ బరువుతో బాధపడుతున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో స్థూలకాయం ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడించాయి. పురుషుల్లో 14% మంది స్థూలకాయంతో బాధపడుతుండగా.. మహిళలు 18.8%గా ఉన్నారు. సామాజిక, ఆర్థిక ప్రతికూలతలు సైతం యువత శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నట్టు సర్వే అభిప్రాయపడింది. చదువుకున్న తల్లులు ఉన్న కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది.
రాష్ట్రంలో 2023 నాటికి 68% యువత మోస్తరు స్థాయి ఒత్తిడికి లోనవుతున్నట్టు సర్వే పేర్కొంది. ప్రతి 10 మందిలో ఇద్దరికీ ఈ లక్షణాలు ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో 15% మంది తేలికపాటి నిరాశ, ఆందోళన లక్షణాలు కలిగి ఉన్నట్టు స్పష్టంచేసింది. పట్టణ యువతలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు సర్వే పేర్కొంది. కొవిడ్ సమయంలో 19% ఉన్న ఈ సమస్య.. 2023 నాటికి 15 శాతానికి తగ్గినట్టు రిపోర్టు వెల్లడించింది. మహిళల కంటే పురుషులు తక్కువ మానసిక సమస్యలకు గురవుతున్నట్టు గణాంకాలు తెలిపాయి. కొవిడ్ తర్వాత ఆరోగ్యకరంగా ఉండాలనే ధృఢ సంకల్పం ప్రజల్లో పెరిగింది. దేశవ్యాప్తంగా అగస్టు 2023 నుంచి జనవరి 2024 వరకు మొత్తం 948 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో యువకులు 641 మంది, 307 మంది పెద్దలు ఉన్నారు. ‘డబుల్ బర్డెన్ మాల్ న్యూట్రిషన్’, మోస్తరు స్థాయి ఒత్తిడిపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్యారోగ్య నిపుణులు కోరుతున్నారు.