Telangana Bhavan | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసేందుకు హైదరాబాద్ తెలంగాణ భవన్కు యువత భారీగా తరలివచ్చింది. బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరవుతారని మీడియా ద్వారా తెలియడంతో యువకులు భారీ సంఖ్యలో పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకుల వెంట, స్వచ్ఛందంగా అభిమానులు, కార్యకర్తలు రావడంతో వారిని నియంత్రించడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలంతో తెలంగాణభవన్ పరిసరాల్లో సందడి నెలకొన్నది. వందలాది వాహనాలు రోడ్ల వెంట బారులుదీరాయి. చాలారోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడంతో ఆయన ను చూడాలని, ఆయనతో సెల్ఫీ దిగాలనే ఉత్సాహంతో యవకులు తరలివచ్చారు. మ ధ్యాహ్నం ఒంటిగంటకు కేసీఆర్ వస్తారని షెడ్యూల్ ప్రకటించినప్పటికీ, ఉదయం 10గంటల నుంచే యువకులు గేట్ల వద్ద పడిగాపులు కాశారు.
పార్టీ ఆహ్వానించిన నేతలనే లోపలికి అనుమతించగా, మిగతా వారు అక్కడే ఉండి కేసీఆర్ కోసం ఎదురుచూశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కేసీఆర్ రావడంతో ఒక్కసారిగా బయట ఉన్నవారు తోసుకొచ్చారు. కేసీఆర్ను ఉద్దేశించి సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. వీలుపడని వారు ఆయన కారు దిగుతుండగా సెల్ఫీలు దిగారు.