హయత్‌నగర్, మే 15 : సహజీవనం చేసిన యువతి మోసగించిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడకు చెందిన పల్ల పు యాదగిరి, మహేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
పెద్ద కుమారుడైన గోవర్ధన్ (28) క్యాబ్ డ్రైవర్. ఇతనికి యాచారం మండలం గున్‌గల్‌కు చెందిన సరితాగౌడ్తో పరిచయం ఏర్పడి మన్నెగూడలో అద్దెకుంటూ నాలుగేండ్లుగా సహజీవనం చేశారు. గత నవంబర్‌లో సరితకు బాబు జన్మించాడు. ఈ క్రమంలో సరిత బాబును విక్రయించి వేరేపెండ్లికి నిర్ణయించుకున్నది. ఇద్దరి మధ్య గొడవతో గోవర్ధన్ సొంతింటికి, సరిత పుట్టింటికి వెళ్లిపోయా రు. మే 6న సరిత వేరేవ్యక్తిని పెండ్లి చేసుకున్నదని తెలుసుకున్న గోవర్ధన్, ఈ నెల 12న తన చావుకు సరిత కారణమని, ఆమెను వదలవద్దని తన తల్లిదండ్రులకు చెబుతున్న వీడియోలు తన సెల్ఫోన్లో చిత్రీకరించుకున్నాడు.
కోహెడలోని ఇంటికి వచ్చిన గోవర్ధన్ నైట్ డ్యూటీకి వెళ్లానని, పడుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు కొట్టగా స్పందించలేదు. స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా.. గోవర్ధన్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. ఎస్ఐ అరుణ్‌కుమార్ ఘటనాస్థలికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి సెల్‌ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. తల్లి మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.