ఉట్నూర్ రూరల్, అక్టోబర్ 25 : అటవీ అధికారుల బెదిరింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గొట్టిపటార్కు చెందిన వాగ్మారే గౌతం(29) రోజూలాగే శుక్రవారం తన చేను సమీపంలో ఎడ్లను మేపుతున్నాడు. పక్కనే ఉన్న అటవీ ప్లాంటేషన్‌లోకి ఎడ్లు వెళ్లాయి. అటవీ శాఖ బీట్ అధికారిణి విజయలక్ష్మి ప్లాంటేషన్‌లో ఎడ్లను ఎందుకు మేపుతున్నావని తిడుతూ.. కేసు పెడుతామని బెదిరించింది.
దీంతో మనస్తాపానికి గురైన గౌతం చేనుకు కొట్టగా మిగిలిన పురుగుల మందు తాగి అక్కడే పడిపోయాడు. కొద్ది సేపటికి తర్వాత గౌతం సోదరుడు నైలేశ్ చేను వద్దకు వచ్చి చూడా గౌతం కిందపడి ఉండటం గమనించాడు. ఏ మైందని ఆరా తీయగా అటవీ శాఖ అధికారిణి బెదిరించిందని, దీంతో భయపడి పురుగుల మందు తాగానని తెలిపాడు. గౌతంను వెంటనే ఉట్నూర్ దవాఖానకు, అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గౌతం తండ్రి వాగ్మారే భుజంగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామయ్య తెలిపారు.
ఎవరినీ భయపెట్టలేదు..
ఉట్నూర్ మండలం గొట్టిపటార్ అటవీ ప్లాంటేషన్‌ను పరిశీలించడానికి బీట్ అధికారిణి విజయలక్ష్మి వెళ్లారు. ఆ సమయంలో ప్లాంటేషన్‌లో ఎడ్లు మేస్తున్నాయి. ఆ ఎడ్లను తమ సిబ్బంది గ్రా మంలోకి తీసుకురాగా వాగ్మారే భుజం గ్‌కు చెందినవని తెలిసింది. ప్లాంటేషన్‌లో ఎడ్లను మేపకూడదని వారికి నచ్చజెప్పి మరోసారి రాకుండా చూసుకోవాలని చెప్పాము. సిబ్బంది వారిపై ఎలాం టి ఆరోపణలు, భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రవర్తించలేదు.
– ఉట్నూర్ ఎఫ్ఆర్వో సంతోష్