జగిత్యాల రూరల్, మే 19: దాదాపు నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో ఓ యువరైతు కడుపు మండింది. ప్రభుత్వం, కేంద్రం నిర్వాహకుల తీరును నిరసిస్తూ వడ్ల కుప్పపై డీజిల్పోసి నిప్పుపెట్టేందుకు యత్నించగా తోటి రైతులు అడ్డుకున్నారు. జగిత్యాల జిల్లా గోపాల్రావుపేటకు చెందిన అంబటి సందీప్ తాను పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు 27 రోజుల క్రితం గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తెచ్చాడు. తూకం వేయకపోవడంతో అప్పటినుంచి ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నాడు. ఈ క్రమంలో తీవ్ర ఆవేదనకు లోనైన సందీప్ ఆదివారం తన ధాన్యం కుప్పపై డీజిల్ చల్లి నిప్పుపెట్టేందుకు యత్నించాడు. తోటి రైతులు గమనించి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. అధికారులు, కేంద్రం నిర్వాహకులు ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డాడు. టోకెన్ల ప్రకారం కొనకుండా ఇష్టారాజ్యంగా తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.